వెంగళరావునగర్, అక్టోబర్ 17: పల్లెటూరులో గంజాయి పండించి.. పట్నంలో అమ్ముతున్న ఇద్దరిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 కిలోల 300 గ్రాముల గంజాయి, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దుల్లో ఉన్న పాడేరు జిల్లాకు చెందిన మాధవరావు (20) నగరంలోని ఎల్లారెడ్డిగూడలో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నాడు.
ఇటీవల వాయిదాల పద్ధతిలో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. డబ్బు లేకపోవడంతో వాహనం వాయిదాలు చెల్లించడంలేదు. డబ్బు కోసం అతడికి పరిచయం ఉన్న అలెక్స్, రాకేశ్‌ను సంప్రదించాడు. అలెక్స్‌కు గంజాయి పీల్చే అలవాటు ఉంది. తన స్వగ్రామంలో గంజాయి పండించి.. తానే స్వయంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు అలెక్స్ చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మాధవరావు తన స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడ అతడి సోదరుడు కేశవరావు పండిస్తున్న గంజాయిని రైలులో నగరానికి తీసుకొచ్చి ఎల్లారెడ్డిగూడలోని తన గదిలో పెట్టుకున్నాడు.
ఈ గంజాయిని తన మిత్రుడైన రాకేశ్‌తో కలిసి విక్రయించేందుకు బల్కంపేట సమీపంలోని నేచర్‌క్యూర్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బంది కలిసి పట్టుకున్నారు. మాధవరావు, రాకేశ్‌ను అరెస్టు చేసి, ఓ ద్విచక్ర వాహనం, 6 కిలోల 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మాధవరావు, రాకేశ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అలెక్స్, కేశవరావు కోసం గాలిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు రాజు రాథోడ్, నర్సింగ్‌రావు, అఖిల, ఏఎస్సై బాలరాజు సిబ్బంది పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ: కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ పార్కులో గంజాయి విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను కేపీహెచ్‌బీ కాలనీ పోలీలులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్ డీమార్ట్ సమీపంలోని పార్కులో నలుగురు యువకులు గంజాయి విక్రయిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది.
పోలీసులు వెంటనే పార్కు వద్దకు చేరుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. ప్యాకెట్లలో గంజాయి లభించింది. గంజాయి విక్రయిస్తున్న వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్ (24), రమేశ్ కృష్ణ (27), నక్కా నాగవంశీ (23), పల్నాడు జిల్లాకు చెందిన జంపనీ సాయిగోపీ విహారి (26) ఉన్నారు. ఈ నలుగురు యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులని, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.