మెహదీపట్నం జూలై 22 : పాత కక్షల నేపథ్యంలో యువకుడిని బండరాయితో మోదీ దారుణ హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కిషన్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆనంద్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫ్ నగర్ జిర్రా ప్రాంతంలో నివసించే మహ్మద్ కబూలా అలియాస్ అడ్డు(27)ను ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు స్నేహితులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసి పారిపోయారు.
అన్ని కోణాలలో విచారించిన పోలీసులు ఈ హత్యకు పాల్పడ్డ నిందితులు మహ్మద్ వసీం, సమీర్ ఖాన్‌ను మంగళవారం పట్టుకున్నారు. పాత గొడవల కారణంగానే అడ్డును హత్య చేశారని ఒప్పుకున్నట్లు వారు తెలిపారు. నేరానికి ఉపయోగించిన కత్తి, పల్సర్ వాహనం, రెడ్మి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిపారు.