హైదరాబాద్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): ఉన్నతాధికారులే ఆఫీసులకు ఆలస్యంగా రావడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హాకా, సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికెషన్, హ్యాండ్లూమ్ ఆఫీసుల్లో ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు కూడా ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడాన్ని గుర్తించిన మంత్రి తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా జనరల్ మేనేజర్, మేనేజర్ స్థాయి అధికారులు సైతం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమయానికి వస్తుంటే, రెగ్యులర్ ఉద్యోగులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సమయపాలన పాటించని అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పై అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలని, విధులపట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని మంత్రి హెచ్చరించారు. సమయానికి విధులకు హాజరుకాని అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కమిషనర్లు, ఎండీలకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు మంత్రి తుమ్మలకు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రిని కలిసిన ప్రతినిధులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మక్కలు, ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులపై మంత్రికి వివరించారు. రంగు మారిన పంటలను కూడా కొనుగోలు చేయాలని కోరారు. రైతు స్వరాజ్య వేదిక వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.