సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై బదిలీల వేటు పడింది. ముఖ్యంగా ప్యాకేజీ-3 కింద పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తక్షణమే ఇతర విభాగాలకు బదిలీ (షఫ్లింగ్) చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాల్సిందిగా సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ శ్రీ దుర్గ భవాని ఎంటర్ ప్రైజెస్‌కు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని షఫ్లింగ్ చేయాలని కమిషనర్ మంగళవారం నిర్వహించిన సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్యాకేజీ-3 పరిధిలోని హెడ్ ఆఫీస్, ఫైనాన్షియల్ అడ్వైజర్, మెడికల్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రికల్ వంటి కీలక విభాగాల్లోని ఆపరేటర్లను బదిలీ చేస్తూ జాబితాను సిద్ధం చేశారు. కొత్తగా కేటాయించిన స్థానాల్లో సిబ్బంది వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఏజెన్సీ స్పష్టం చేసింది.
విధుల్లోకి చేరకుంటే జీతాల జాబితా నుంచి ఔట్..
బదిలీ ప్రక్రియను ఫిబ్రవరి 3 (మంగళవారం)న రాత్రి వరకు ఎట్టి పరిస్థితిలోనైనా పూర్తిచేయాలని ఏజెన్సీ హెచ్చరించింది. కమిషనర్ పంపిన జాబితా ప్రకారం బదిలీ అయిన చోట చేరకున్నా, లేదా విధుల్లో అలసత్వం ప్రదర్శించినా సంబంధిత ఉద్యోగుల పేర్లను జీతాల జాబితా నుంచి తొలగించనున్నట్లు పేరొంది. కాగా మార్చి 31 వరకు కొత్తగా బదిలీ అయిన విభాగాల నుంచి అటెండెన్స్ సర్టిఫికెట్ పొందిన వారికే ప్రస్తుత విధానంలో జీతాలు చెల్లిస్తారు. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ప్యాకేజీ నిబంధనల ప్రకారం వేతనాలు జమ కానున్నాయి.
ఇవేం బదిలీలు
పాలనలో పారదర్శకత పెంచడానికి, ఏళ్ల తరబడి ఒకేచోట ఉండి అవినీతికి ఆసారం లేకుండా చేయడానికి ఈ షఫ్లింగ్ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాలు కచ్చితంగా అమలుకావాలని, ఇందులో ఎలాంటి జాప్యం జరిగినా సంబంధిత విభాగాధిపతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సర్యులర్‌లో పేరొన్నారు. ఈ హఠాత్తు పరిణామంతో జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో కలకలం మొదలైంది. అన్నింటి కంటే సంబంధం లేని విభాగాలకు బదిలీలు చేయడం ఏంటని ఉద్యోగులు వాపోతున్నారు.