సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద బహుళ అంతస్తుల ఫె్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 1 నుంచి 3 నెలల పాటు డీఎల్ఎఫ్ గేట్ నంబర్-1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ వరకు రహదారిని మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లిడించారు. నిర్మాణ పనులు సుమారు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మంగళవారం మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మాదాపూర్, కేబుల్ బ్రిడ్జ్, ఐకియా జంక్షన్, ట్రైడెంట్ హోటల్ పరిసరాలు, శిల్పకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.