Hyderabad | హైదరాబాద్ : తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఎస్బీఐ గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి వైపు, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలతో వాహనాలను మళ్లించడం ద్వారా రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ కాంప్లెక్స్, బషీర్‌బాగ్, ఎస్బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, లిబర్టీ సర్కిల్, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ జంక్షన్ల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నగరవాసులు, వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇబ్బందులుంటే 9102033626 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.