Traffic | సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నది. దాదాపుగా జనాభాతో పోటీపడే విధంగా సంఖ్య పైపైకి దూసుకుపోతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుంటే ఈ ఏడాది జనవరి ఆఖరు నాటికి 82,45,304 వాహనాలు ఉన్నట్టు రవాణా శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 58,71539 వాహనాలు ఉండగా కార్లు ఆ తర్వాతి స్థానంలో 15 లక్షల వరకు ఉన్నాయి.
గ్రేటర్ పరంగా చూస్తే వాహనాల రిజిస్టేష్రన్లలో హైదరాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంది. హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్, మెహిదీపట్నం, బండ్లగూడ, మూసారంబాగ్, తిరుమలగిరిలో, గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డిలో కొండాపూర్, అత్తాపూర్, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో ఉప్పల్, కూకట్‌పల్లిలో ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 40.66 లక్షల అన్ని రకాల వాహనాలు, రంగారెడ్డి పరిధిలో 20.39 లక్షలు, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో 21.40 లక్షల వరకు ఉన్నట్లుగా రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 82,45,304 వాహనాలు ఉన్నాయి.
ఇందులో ద్విచక్ర వాహనాలు 58,71539 వాహనాలు ఉండగా కార్లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. సాధారణంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఎంఎంటీఎస్… గత కొన్ని సంవత్సరాలుగా మెట్రో రైలు ఉన్నప్పటికీ వ్యక్తిగత వాహనాలకు మాత్రం డిమాండు తగ్గడం లేదు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 24 లక్షల మంది ప్రయాణిస్తుండగా… మూడున్నర లక్షల మంది ఎంఎంటీఎస్‌లో తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. మెట్రో రైలులో రోజుకు 1.20 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. అయితే ఇంతస్థాయిలో ప్రజా రవాణాకు ఆదరణ లభిస్తున్నప్పటికీ వ్యక్తిగత వాహనాలపై ప్రయాణిస్తున్న వారి సంఖ్య కూడా లక్షల్లో ఉండటం విశేషం.
నానాటికీ పెరుగుతున్న జనాభాతో వారి అవసరాలకు తగినట్టుగా నగరంలో వాహనాలు పెరిగిపోతున్నాయి. వీటికి తోడు మెట్రోపాలిటన్ జీవనశైలికి అనుగుణంగా సేవలందించే సర్వీస్ యాప్‌లు రావడంతో అందులో పనిచేసే ఉద్యోగులు కూడా వ్యక్తిగత వాహనాలు వాడుతున్నారు. దాదాపు 85 లక్షల వాహనాలు నిత్యం రోడ్డుపైకి రావడంతో నగరంలో ఉదయం నుంచి సాయత్రం వరకు ట్రాఫిక్ ఇబ్బందులు అంతకంతకూపెరిగిపోతున్నాయి. సిగ్నల్ పాయింట్స్ వద్ద 20సెకన్స్, 60 సెకన్స్ ఇలా సిగ్నలింగ్ ఉన్నప్పటికీ ఆ సమయంలో కొన్ని వాహనాలు మాత్రమే సిగ్నల్ దాటుతున్నాయి. అప్పటికే సిగ్నల్ వద్దకు వందలాది వాహనాలు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ సిగ్నల్ పాయింట్ వాహనాలతో రద్దీని తలపిస్తున్నది. కొన్ని సిగ్నల్ పాయింట్స్ వద్ద కాలు కింద పెట్టే పరిస్థితి కూడా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు.