కంటోన్మెంట్, ఏప్రిల్ 6: కంటోన్మెంట్‌లోని స్థిరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమవుతున్న ఐదు శాతం ప్రాపర్టీ ట్యాక్స్ నేరుగా వసూలు చేయాలని కంటోన్మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం బోర్డు కార్యాలయం లో బ్రిగేడియర్ రాజీవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి బోర్డు సీఈవో అరవింద్‌కుమార్ ద్వివేది, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద, ఎమ్మెల్యే శ్రీగణేశ్లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు టీపీటీ బకాయిలు సకాలంలో విడుదల చేయకపోవడంతో నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుండడం తో ఎస్ఆర్వో (సబ్ రిజిష్ర్టేషన్) కార్యాలయాల నుంచి ఆదాయం నేరుగా కంటోన్మెంట్‌కు చెల్లించేలా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని తీర్మానించారు.
ఎస్సీబీ/10 (ఈ) 1506/89 ప్రకారం కంటోన్మెంట్ రెవెన్యూ కంటోన్మెంట్‌కు చెందేలా నిర్ణయించిన తీర్మానాన్ని నోటిఫికేషన్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి, సబ్రిజిస్ట్రార్లకు బోర్డు అధికారులు సమాచారం ఇవ్వనున్నారు. ట్రా న్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ( టీపీటీ) చెల్లింపులను నిరాకరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు నిర్ణయించారు. ఈ మేరకు టీపీటీ బకాయిలు వసూలుకు ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం అనంతరం బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మా ట్లాడుతూ ..ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌కు మాట్లాడేందుకు నాలుగుసార్లు అవకాశం వచ్చినా కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.80 కోట్ల టీపీటీ బకాయిల కోసం మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీపీటీ బకాయిల విషయంలో అడుక్కునే పరిస్థితి ఉండడంతో బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని ఇది శుభపరిణామమని ఇకపై టీపీటీ నిధులు నేరుగా కంటోన్మెంట్ ఖాతా లో జమ అయితే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే శ్రీగణేశ్ మాట్లాడుతూ.. బోర్డు సమావేశం కేవలం టీపీటీ చార్జీలపై మాత్రమే కాకుండా కేంద్రం నుంచి రావల్సిన సర్వీస్ చార్జీలపై కూడా పెడితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.