సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): అది 2008… వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం… హైదరాబాద్ నగరంలో తొలిసారిగా టన్నెల్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రయోగాత్మకంగా లిబర్టీ నుంచి నింబోలి అడ్డ వరకు ఐదు కిలోమీటర్ల మేర 1800 డయాతో డ్రైనేజీ టన్నెల్ పనులు ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో 2009, జూలైలో మొదలయ్యాయి. ఒకడుగు ముందుకు… ఆరడుగులు వెనక్కి.! అన్నట్లుగా పనులు సాగాయి. పైగా సంవత్సరాల తరబడి వాహనదారులకు ట్రాఫిక్ నరకం. కాంగ్రెస్ పాలన ముగిసే 2014 వరకు సగం కూడా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపసోపాలు పడితే… 2022లో నాలుగు కిలోమీటర్లు పూర్తయింది.
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ).. శ్రీశైలం నుంచి గ్రావిటీపై నల్లగొండ జిల్లాకు కృష్ణాజలాలను అందించే ప్రాజెక్టు.. 13 మీటర్ల డయాతో 44 కిలో మీటర్ల సొరంగం 2008లో మొదలైంది. రెండు టన్నెల్ బోరింగ్ మిషన్ల (టీబీఎం)తో సంవత్సరాల తరబడి పనులు చేశారు. అనేక సాంకేతిక అవాంతరాలు. చివరికి మధ్యలో యంత్రం ఇరుక్కుపోయింది. అది ముందుకు పోలేదు.. వెనక్కి రాలేదు.. ఇంజినీర్లు, ఏజెన్సీ సైతం తల పట్టుకొని కూర్చునే పరిస్థితి.
రోడ్లు… ఫ్లైఓవర్లు అనేది ఒక లెవల్ టెక్నాలజీ. అంతకుమించి టన్నెల్ టెక్నాలజీ ఉంది. స్ట్రెయిట్ కనెక్టివిటీ లైన్. దిల్సుఖ్నగర్ నుంచి జూబ్లీహిల్స్ వరకు వెళ్లాలనుకున్నా.! బహదూర్‌పుర నుంచి బాలానగర్ వరకు వెళ్లాలనుకున్నా.!! అండర్ టన్నెల్ రోడ్డు ద్వారా స్ట్రెయిట్‌గా వెళ్లొచ్చు. బయటి రోడ్లు ఉన్నట్లు కాదు. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో ఎంత రోడ్డు కావాలంటే అంత రోడ్డు వేసుకోవచ్చు. ఈ నెల 3వ తేదీన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ‘మీట్‌ది ప్రెస్’లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినా గొప్పలు ఇవి. పై రెండు ఉదాహరణలు మన కండ్ల ముందు ఉన్న అనుభవాలు. ఇంతమాత్రాన ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టవద్దని కాదు.! కాకపోతే… ఇంత క్లిష్టమైన పనులను చేపట్టే ముందు గానీ.. కనీసం ప్రతిపాదించే ముందుగానీ.. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం అనివార్యమని ఈ అనుభవాలు నేర్పుతాయి. కానీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఇవేవీ పట్టవు. మైకు, కెమెరా ముందుంటే చాలు.! గాలిలో మేడలు కట్టినట్లు… అక్షరాల్లోనే కిలోమీటర్ల సొరంగాలు నిర్మిస్తారు. కంప్యూటర్లలో గ్రాఫిక్స్ చేసినట్లు… కనీస అవగాహన లేకుండానే హైదరాబాద్ నగరాభివృద్ధిపై ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తారు. ఇందులో భాగంగా నగరంలో ఆ మూల నుంచి ఈ మూలకు… ఈ మూల నుంచి ఆ మూలకు… ఏకంగా సొరంగ మార్గంలో రహదారులను నిర్మిస్తారట.! కూట్ల రాయి తీయనోళ్లు… ఏట్ల రాయి తీయడమంటే ఇదే మరి.!! కనీసం ఐదు కిలోమీటర్ల చిన్న టన్నెల్‌ను ఐదేండ్లలో రెండు కిలోమీటర్లు నిర్మించలేని కాంగ్రెస్ పార్టీ.. పదుల కిలోమీటర్లలో భారీ సొరంగ రహదారుల వ్యవస్థను నిర్మిస్తామంటే నమ్మేదెవరు.?!
టన్నెల్ బోరింగ్ మిషన్‌తో సొరంగ మార్గం నిర్మాణం చేపట్టాలంటే రెండు మార్గాలున్నట్లు నిపుణులు తెలిపారు. సాధారణంగా మైదాన, గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు చేపట్టడం సులువు. ముఖ్యంగా సొరంగ మార్గం నిర్మించే సమయంలో ఆడిట్ టన్నెల్స్ నిర్మిస్తారు. టన్నెల్‌కు కుడి, ఎడమవైపు నిర్మించే టన్నెల్స్‌ను ఆడిట్ టన్నెల్స్ అంటారు. అంటే భూమిలో తవ్వుకుంటూ వెళ్లినపుడు వచ్చే మట్టి, రాళ్లను వెంటనే అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా తొలగించి, దూరంగా పారబోసేందుకు రెండువైపులా ఉండే ఆడిట్ టన్నెల్స్ ద్వారా బయటికి తీసుకువస్తారు. తద్వారా యంత్రం ముందుకు పోతుంది. ప్రతి కిలోమీటరున్నరకు ఒక ఆడిట్ టన్నెల్ నిర్మిస్తారు.
మరి నగరంలో ఇలా కిలోమీటరున్నరకు ఆడిట్ టన్నెల్స్ నిర్మించడం సాధ్యమా? అదే చేయాలంటే నగరం మొత్తం సొరంగాల మయం అవుతుంది. పైగా ప్రధాన సొరంగ మార్గం కంటే ఆడిట్ టన్నెల్స్‌కు వ్యయం ఇంకా తడిసి మోపడవుతుంది. మరీ ముఖ్యంగా దక్కన్ పీఠభూమి అయినప్పటికీ నగరంలో భారీ నిర్మాణాలు, హెరిటేజ్ భవనాలు, మెట్రో మార్గాలు ఉన్నాయి. లిబర్టీ నుంచి నింబోలి అడ్డా సొరంగ మార్గం మధ్యలోనే మెట్రో పిల్లర్ రావడంతో సొరంగ మార్గాన్ని పక్క నుంచి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఇలా మార్చిన సందర్భాల్లో అంచనా వ్యయం కూడా పెరుగుతుంది.
ఆడిట్ టన్నెల్స్ అవసరం లేకుండా కూడా సొరంగ మార్గాలు నిర్మిస్తారు. ఉదాహరణకు… ఎస్సెల్బీసీ. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే సొరంగ మార్గం నల్లమల అటవీ ప్రాంతం (రాజీవ్‌గాంధీ టైగర్ ఫారెస్ట్) మీదుగా రావాల్సి ఉన్నందున.. మూగజీవాలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆడిట్ టన్నెల్స్‌కు అనుమతులు ఇవ్వలేదు. అందుకే శ్రీశైలం దగ్గర టీబీఎం యంత్రం భూమిలోకి వెళ్లిందంటే అటవీ ప్రాంతం ముగిసే వరకు (44 కిలోమీటర్లు) బయటికి వచ్చేందుకు ఆస్కారం లేదు. దీంతో యంత్రం తవ్వుకుంటూ ముందుకు పోతుంటే… అదే మార్గంలో వెనక్కి నెట్టే మట్టిని టిప్పర్ల ద్వారా బయటికి తరలించాలి.
ఇదే విధానంలో నగరంలో సొరంగ మార్గం నిర్మించాల్సి ఉంటుంది. ఎస్సెల్బీసీలో టీబీఎం యంత్రం మరమ్మతులు చేయాల్సినపుడల్లా నెలల తరబడి పనులు ఆగేవి. ప్రస్తుతం అది ఇరుక్కుపోవడంతో అటు ముందుకు… ఇటు వెనక్కి రాలేని దుస్థితి. ఇదే పరిస్థితి నగరంలో తలెత్తితే..?!
సాధారణంగా సొరంగ మార్గంలో రహదారుల నిర్మాణం అనేది ప్రపంచంలోని పలు నగరాల్లో ఉంది. కాకపోతే తప్పని పరిస్థితుల్లో… అదే అనివార్యమైతే తప్ప ఆ నిర్మాణాల జోలికి వెళ్లరు. ఎందుకంటే అది భారీ ఖర్చుతో కూడుకున్న నిర్మాణాలు. పైగా… నగరాల నడిబొడ్డున సొరంగ మార్గాల నిర్మాణమంటే ఆషామాషీ కాదు. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) విధానంలోనే సొరంగ మార్గాలను నిర్మించేందుకు కనీసంగా కిలోమీటరుకు రూ.వెయ్యి కోట్ల వరకు అవుతుందని ప్రాథమిక అంచనా. బెంగళూరులో కూడా ఇదే తరహా ప్రాజెక్టు ప్రతిపాదన ఒకటి ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 60 కిలోమీటర్ల మేర సొరంగ రహదారి నిర్మాణానికి ప్రాథమికంగానే రూ.50వేల కోట్ల అంచనా వేశారు. అంటే రమారమి కిలోమీటరుకు రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతున్నట్లే. మరి… మెట్రో మార్గానికి కిలోమీటరుకు రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుంది. పైగా ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయవచ్చు. ఇంత వెసులుబాటు ఉన్న తర్వాత క్లిష్టమైన, భారీ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు చేపడతామనడం మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు.
సొరంగ మార్గం నిర్మించాలంటే ‘టూ టైమ్స్ ఓవర్ బర్డెన్’ అనేది కీలకమని నిపుణులు తెలిపారు. అంటే ఎంత డయా సొరంగం నిర్మిస్తున్నామో… అంతకు రెట్టింపు భూమి లోపలికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉదాహరణకు… ఏడు మీటర్ల డయాతో రహదారుల కోసం సొరంగం నిర్మించాలంటే 21 మీటర్ల లోతుకు వెళ్లాలి. అప్పుడు ఏడు మీటర్ల సొరంగం నుంచి భూ ఉపరితలం వరకు పద్నాలుగు మీటర్ల గ్యాప్ ఉంటుంది. అప్పుడే సొరంగం కూలకుండా గట్టిగా ఉంటుంది. మరి… నగరంలో 21 మీటర్ల లోతు అంటే దాదాపు 69 ఫీట్లు లోపలికి వెళ్లాలి. ఇంత లోతులో పదుల కిలోమీటర్లు సొరంగం సాధ్యమేనా..?!