సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం ముందస్తు చర్యలపై జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అప్రమత్తమైంది. కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ఆదేశాల మేరకు సెల్లార్, శిథిల భవనాల ప్రమాదాల నివారణే లక్ష్యంగా సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీసీపీ కె. శ్రీనివాస్ జోనల్ ఏసీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయా జోనల్ ఏసీపీ నిర్మాణ దశలో ఉన్న కన్‌స్ట్రక్షన్స్‌పై క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క నిర్మాణదారు సెల్లార్ దశలో రక్షణ గోడ నిర్మించాలి.
చాలా మంది సెల్లార్ తవ్వకాలపై నిబంధనలు ఉల్లంఘించి ఎడపెడా పనులు జరపడం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో శేరిలింగంపల్లి సిద్దిఖ్‌నగర్‌లో ఓ భవనం నేలకు ఒరిగింది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. వెంటనే అధికారులు సంబంధిత భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఎల్బీనగర్లో సెల్లార్ తవ్వకాల సందర్భంగా మట్టిదిబ్బులు కూలి కార్మికులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో ప్రమాదాలకు తావివ్వకుండా సంబంధిత నిర్మాణదారులను గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఏసీపీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేయనున్నారు. వర్షాకాలం ప్రారంభం నాటికల్లా తవ్వి ఉంటే అక్కడ అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలి. సాయిల్ బలోపేతం, రిటైనింగ్ వాల్, బారికేడింగ్ తదితర చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. చుట్టు పక్కల భవనాలకు ప్రమాదం జరగకుండా జాగ్రత్త చర్యలు పాటించాలి. ప్రమాదానికి ఆస్కారం ఉంటే వెంటనే సీ అండ్ డీ విభాగం సహకారంతో సెల్లార్‌ను మూసివేయాలి. వర్షాకాలంలో అక్రమంగా ఎవరైనా సెల్లార్ తవ్వితే వెంటనే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకునేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటికి తోడు శిథిల భవనాల గుర్తింపునకు సర్వే చేపడుతున్నారు.