సిటీబ్యూరో, జూన్13, (నమస్తే తెలంగాణ): ప్రాణాపాయంలో ఉన్నవారికి మనం చేసే గొప్పసాయం ఏదైనా ఉందంటే అది కేవలం రక్తమిచ్చి వారి ప్రాణాలు కాపాడటమే. చాలామంది ప్రమాదాల భారీన పడినప్పుడు సకాలంలో కావాల్సిన రక్తం లభించకపోవడంతో ప్రాణాలు సైతం కోల్పొతున్నారు. అందుకే ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తంకోసం ఎదురుచూసే వారికి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం మన మొదటి కర్తవ్యం. ప్రభుత్వాలు సైతం ప్రజల్లో రక్తదానం గురించి అనేక క్యాంపులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి. అందులో భాగంగా ఏటా జూన్14 న ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ నిర్వహిస్తూ, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఓ థీమ్‌తో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఈ సారి సైతం..‘రక్తదానం చేయండి, భరోసా నివ్వండి, కలిసికట్టుగా ప్రాణాలు కాపాడుదాం’ అనే థీమ్‌తో ముందుకు సాగుతుండటం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 296 రక్తనిధి కేంద్రాలు ఉండగా వాటిలో 53 ప్రభుత్వానివే కావడం గమనార్హం. 53 రక్తనిధి కేంద్రాల్లో 26 కేంద్రాలు కాంపోనెంట్ బ్లడ్ సెంటర్లుగా రక్తసేకరణ, పంపిణీ చేస్తుండటం గమనార్హం. హైదరాబాద్ జిల్లాలో నిలోఫర్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, గాంధీ జనరల్ ఆసుపత్రి, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ, పేట్లబుర్జ్, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, ఎంఎన్‌జే, కింగ్కోటీ జిల్లా ఆసుపత్రి, నారాయణగూడలోని ఐపీఎం లలో బ్లడ్ బ్యాంక్ సెంటర్లు ఉండగా, రంగారెడ్డిలో కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రి, షాద్‌నగర్‌లోని ఏరియా ఆసుపత్రి కేంద్రంగా ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి.
మేడ్చల్ జిల్లాలో సైతం రెండు కేంద్రాల్లో రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. రక్తనిధి కేంద్రాల్లో నిమ్స్, గాంధీ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రులు ముందు వరసలో ఉండి అవసరమున్న వారికి ఉచితంగా రక్తాన్ని ఇస్తున్నారు. సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న ఎంతో మంది రోగులను చూసి కేఎంసీ విద్యార్థులు చలించిపోయారు. అలాంటివారిలో కనీసం కొంతమంది ప్రాణాలైనా కాపాడాలని తలిచారు. కాకతీయ మెడికల్ కాలేజీలో 2021 బ్యాచ్‌కు చెందిన మెడికల్ విద్యార్థి కందుల లోకేశ్ కుమార్, 2022 బ్యాచ్‌కు చెందిన చల్ల నవనీత్ ఆలోచనల్లోంచి పుట్టిందే మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్. ఈ క్లబ్‌ద్వారా ఇప్పటివరకు 1000 మందికి రోగులకు రక్తదానం చేశారు.