నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాజీయే రాజమార్గం.. అనే నానుడి అక్షరాల నిజం చేసేందుకు ప్రతీ మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి నేతృత్వంలో లోక్ అదాలత్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కక్షిదారులకు కావాల్సిన భోజన, నీటి సరఫరాతో పాటు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగు చర్యలు చేపట్టారు.
సికింద్రాబాద్, మనోరంజన్, నాంపల్లి కోర్టుల్లో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో రాజీ చేసుకునేందుకు సహకారాన్ని అందించారు. రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని కక్షిదారులు గమనించాలని సూచించారు. కోర్టుల చుట్టూ తిరిగే అవకాశముండదని, అధిక కేసుల పరిష్కారానికి అధికారులు సహకరిచేలా చర్యలు చేపట్టారు. కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, పెట్టీ కేసులు, ట్రాఫిక్ చలాన్లు, ఈ-పెట్టీ కేసులను తొలగించే వీలుంటుంది.
వాహనాలపై నమోదైన అధిక చలాన్లను తగ్గించి చెల్లించే వెసులుబాటును సైతం కల్పించే అవకాశముంది. లోక్ అదాలత్లో పరిష్కరింపబడిన కేసులకు అప్పీలు (ఉన్నత న్యాయస్థానం) చేసుకునే అవకాశముండదు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యంగా తొలగించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. కక్షిదారులు సంబంధిత పోలీసు స్టేషన్లను సంప్రదించి.. కేసులను కొట్టేసుకునేందుకు లోక్ అదాలత్లో భాగం పంచుకోవాలంటూ ఇటీవల పలు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.