సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : అమ్మ ప్రేమానురాగాలను పంచుతుంది. పొరపాట్లను సహిస్తుంది. మార్గదర్శనం చేస్తుంది. మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే శక్తినిస్తుంది. నిర్మల భక్తితో తలిస్తే చాలు నేనున్నానంటూ వెలుస్తుంది. సకల శుభాలను అనుగ్రహిస్తుంది. అలాంటి జగన్మాత పండుగ నేడు. అదే దసరా. గ్రేటర్లో దసరా ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆలయాలు జిలుగువెలుగులతో ముస్తాబయ్యాయి. పూల మార్కెట్లు, మిఠాయి దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. నగరంలో ప్రధాన కూడళ్లలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు చేశారు. సాయంకాలం జమ్మి చెట్టు ఏర్పాటు వంటివన్నీ సిద్ధం చేశారు. మొత్తంగా దసరా సంబురాలు అంబరాన్నంటేలా జరుపుకోవడానికి నగరవాసులు ఉత్సాహంగా ఉన్నారు. ఒకరికొక్కరూ జమ్మి ఆకు పంచుకుంటూ.. అలయ్ బలయ్ తీసుకోనున్నారు.