సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత వర్షాకాలంలో నగరంలో వరద ఉధృతిని అరికట్టడానికి, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండటానికి రాజేంద్రనగర్, శంషాబాద్ పరిధిలోని జలమయమయ్యే ప్రాంతాల్లో ఉన్నతాధికారుల బృందం సోమవారం సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. హైడ్రా, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు ఈ పర్యటనలో నీరు నిలవడానికి కారణాలను విశ్లేషించి తక్షణ నివారణ చర్యలపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు నిలిచిపోయే రామ్‌దేవ్‌బాబా వాటర్‌లాగింగ్ పాయింట్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై పిల్లర్నెంబర్లు 265,191 వద్ద ఉన్నతస్థాయి బృందం పరిశీలించి ఆయా ప్రాంతాల్లోని డ్రైనేజీ మౌలిక వసతులు, వరద నీటి కాలువల సామర్థ్యం, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గాలను సమీక్షించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు వీలుగా ఇంజి నీరింగ్, ఫీల్డ్ సిబ్బందికి నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశారు. రాబోయే వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పిల్లర్ల పరిసరాల్లో, క్యాచ్ పిట్ల వద్ద వర్షపునీరు ఉచితం గా ప్రవహించేందుకు అడ్డుగా ఉన్న పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బందిని ఆదేశించారు.
రామ్దేవ్బాబాపాయింట్ , పీవీఎన్ఆర్ పిల్ల ర్ల వద్ద క్లౌడ్ బర్న్ లేదా భారీ వర్షాలు కురిసినప్పుడు నిలిచిన నీటిని వెంటనే తోడేయడానికి అత్యధిక సామర్థ్యం కలిగిన డీ వాటరింగ్ పంపులను శాశ్వతంగా అందుబాటులో ఉంచాలని చెప్పారు. ట్రాఫిక్ జాయిం ట్ కమిషనర్, ట్రాఫిక్ డీసీపీల ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ముందస్తు వర్షాకాల అత్యవసర బృందాలను రంగంలోకి దించి తక్షణ ప్రత్యామ్నాయ మార్గాల మళ్లింపును పర్యవేక్షించడం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వాహనదారులను అలర్ట్ చేయడం, నిలిచిపోయిన వాహనాలను భారీ క్రేన్ల సాయంతో తక్షణమే తొలగించి ట్రాఫిక్ జామ్‌లు కాకుండా చూడాలన్నారు.
హైడ్రా, జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ స్కాడ్స్, ట్రాఫిక్ పోలీసులు నిరంతరం సమన్వయం తో అందుబాటులో ఉండాలని, భారీ వర్షాల సమయంలో నీటినిల్వల సమాచారాన్ని ఎప్పకటిప్పుడు పంచుకోవడానికి వీలుగా వైర్లెస్ కమ్యూనికేషన్ చానల్లను ఉపయోగించాలని ఉన్నతాధికారులు సిబ్బందికి చె ప్పారు. ప్రమాదాలను నివారించడానికి వీలుగా ప్రధాన వరద నీటికాలువలపై విరిగిన గ్రేటింగ్లను మరమ్మతు చేయాలని చెప్పారు. ఈ పర్యటనలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌హెగ్డే, శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.