సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): మెట్రో ప్రయాణికులకు హెచ్ఎంఆర్ షాకిచ్చింది. అనుకున్నట్లుగానే టికెట్ రేట్లను పెంచింది. శనివారం నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అప్పులను సాకుగా చూపుతూ… ఆర్థికంగా నిలబడేందుకే టికెట్ ధరలు పెంచాల్సి వస్తున్నదన్న వివరణ ఇచ్చింది. కనిష్ఠంగా ప్రస్తుతం రూ. 10 ఉన్న టికెట్ ధర రూ.12 అవుతుండగా, గరిష్ఠం రూ. 60 నుంచి రూ. 75కి చేరనున్నది. ఈ లెక్కన సగటున ప్రతి టికెట్‌పై 20 శాతం ధరలను పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ధరల ప్రకారం ఎల్బీనగర్ నుంచి విక్టోరియా మెమోరియల్ ప్రస్తుతం రూ. 10 ఉంటే పెరిగిన ధరతో రూ. 12. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వెళ్లేందుకు రూ. 45 ఉండగా, తాజాగా రూ. 50 కానున్నది. కొత్త చార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.
చార్జీలు పెంచాలని ఫేర్ ఫిక్సేషన్ కమిటీ 2023 జనవరి 25న అప్పటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే టికెట్ ధరలను పెంచే ఉద్దేశమే లేదని కాంగ్రెస్ సర్కారు చెబుతూనే.. ఆ పాత నివేదిక ఆధారంగానే రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మెట్రో ధరల పెరుగుదలపై ప్రయాణికులు తీవ్రంగా స్పందిస్తుండగా… స్టేషన్ పరిసరాల్లో ఉచిత టాయిలెట్లు, పరిశుభ్రత పాటించాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మెట్రో టికెట్ ధరలను పెంచడంపై సీపీఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ‘సామాన్యుడికి మెట్రో ప్రయాణం మరింత భారం కానున్నది.
ఎల్ అండ్ టీ సంస్థకు వచ్చే నష్టాలకు, ఆ సంస్థ నిర్వాహణ వైఫల్యమే, 50శాతం రియల్ ఎస్టేట్ ద్వారా రావాల్సిన ఆదాయాన్ని సర్దుబాటు చేసుకోకపోవడంతోనే ఇప్పుడు టికెట్ల ధరలకు కారణమైంది’.. అని ఆ పార్టీ మండిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం లేకుండా చార్జీలను ఎలా పెంచారంటూ, ఈ అంశంలో రాష్ట్ర సర్కారు పునరాలోచన చేసి సామాన్యుడిపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ సీపీఎం కార్యదర్శి వెంకటేశ్ పేర్కొన్నారు.