నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు.. కలవరపాటుకు గురిచేశాయి. ఒకే రోజు మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఆసిఫ్‌నగర్, బాలాపూర్‌లో యువకులు, చందానగర్‌లో వివాహితను హతమార్చారు. యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్ కూడలి వద్ద కదులుతున్న బస్సు నుంచి దిగబోయి..ఓ ఇంటర్ విద్యార్థిని దుర్మరణం పాలైంది.
Hyderabad | మెహిదీపట్నం: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఏసీపీ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్‌నగర్‌లో నివసించే ముజాహిద్ గతేడాది ఆగస్టు 27న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఆసిఫ్‌నగర్‌లో నివసించే అబ్దుల్ ఖుద్దూస్ (27) కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ముజాహిద్ సోదరులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఆసిఫ్‌నగర్ క్రాస్ రోడ్ సమీపంలో ఖుద్దూస్ వెంటపడి.. దాడి చేసి పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఖుద్దూస్‌ను ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున అతడు మృతి చెందాడు.
కొండాపూర్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత హత్యకు గురైంది. ఇన్స్పెక్టర్ పాలవెల్లి తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం సేడం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(32), కుటుంబంతో కలిసి వలస వచ్చి.. నగరంలోని నల్లగండ్ల లక్ష్మి విహార్ ఫేజ్ -1లో నివాసముంటూ స్థానిక అపర్ణ టవర్స్‌లో వంట మనిషిగా పని చేస్తూ.. భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నది. శుక్రవారం మధ్యాహ్నం దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. హంతకుడు లింగంపల్లికి చెందిన ఆటోడ్రైవర్ భరత్ అలియాస్ శ్రీనివాస్గౌడ్గా గుర్తించారు. మృతురాలి సోదరుడు సునీల్ శ్రీనివాస్ గౌడ్ నుంచి ఫైనాన్స్ తీసుకున్నాడని, ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి పోలీసు కేసు వరకు వెళ్లగా, ఇటీవలే లోక్ అదాలత్‌లో కేసును ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి కత్తితో విజయలక్ష్మి గొంతు కోసి చంపేశాడు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పాలవెల్లి తెలిపారు. కాగా, హంతకుడు శ్రీనివాస్‌గౌడ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
బడంగ్‌పేట, జూన్ 14: మాట్లాడుదామని పిలిచి.. ఓ యువకుడిని దారుణంగా చంపేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం హపీజ్ నగర్‌కు చెందిన మహ్మద్ మున్నీర్ కుమారుడు మహ్మద్ సమీర్(19) డెకరేషన్ పనులు పనిచేస్తుంటాడు. సమీర్ తన ఇంట వద్ద ఉన్న మహిళ కోసం తరచుగా ఓ యువకుడు వస్తున్న విషయాన్ని గమనించాడు. ఇక్కడికి రావద్దని సమీర్ హెచ్చరించాడు. ప్రతి దానికీ అడ్డు తగులుతున్న సమీర్‌పై ఆ యువకుడు కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి సమీర్‌ను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఐదుగురు యువకులు కలిసి హఫీజ్‌నగర్‌లో ఉన్న సమీర్‌కు ఫోన్ చేసి మాట్లాడుకుందామని పిలిచారు. రాయల్ కాలనీ గుర్రం చెరువు దగ్గరకు రావాలని చెప్పడంతో వారు చెప్పినట్లుగానే సమీర్ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే కాపు కాసి ఉన్న ఐదుగురు సమీర్‌పై కత్తులతో దాడి చేసి పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి, బాలాపూర్ సీఐ భూపతితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న సమీర్‌ను వైద్యశాలకు తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.
వెంగళరావునగర్, జూన్ 14 : అక్క బస్సు ఎక్కలేదని.. కదులుతున్న బస్సు నుంచి కిందకు దిగబోయిన ఓ ఇంటర్ విద్యార్థిని.. చక్రాల కిందపడి దుర్మరణం పాలైంది. అయితే బస్సును ఆపమన్నా.. ఆపలేదని.. తన చెల్లి ప్రాణాలు పోవడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతురాలి అక్క కన్నీటిపర్యంతమైంది. ఈ విషాద ఘటన యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..బోరబండ సఫ్దర్‌నగర్‌కు చెందిన దినసరి కూలీ ఎండీ సలీం, ఆరిఫా సుల్తానా దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు జువేరియా(17), మసీరా మెహ్రీన్(16) యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఓ కాలేజీలో చదువుతున్నారు. మసీరా మెహ్రీన్ ఇంటర్ మెదటి సంవత్సరం సీఈసీ చదువుతున్నది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి శుక్రవారం కాలేజీకి వెళ్లారు. క్లాసులు ముగిశాక.. ఇంటికి వెళ్లేందుకు కాలేజీ సమీపంలోని బస్టాప్ వద్దకు తోటి స్నేహితులతో కలిసి వచ్చారు. అంతలో కేపీహెచ్‌బీ డిపోకు చెందిన సికింద్రాబాద్ నుంచి బోరబండ వెళ్లే 10వై రూట్ నంబర్ బస్సు వచ్చి ఆగింది. అప్పటికే ప్రయాణికులతో బస్సు రద్దీగా ఉంది. మసీరా మెహ్రీన్ బస్సు ఎక్కగా.. ఆమె అక్క జువేరియా బస్సు ఎక్కలేకపోయింది. అక్క ఎక్కలేదు..బస్సు ఆపండంటూ.. మెహ్రీన్ డ్రైవర్‌కు చెప్పినా..అతను వినిపించుకోలేదు. బస్సు యూసుఫ్‌గూడ మలుపు వద్దకు వచ్చేసరికి..మసీరా మెహ్రీన్ బస్సు నుంచి కిందకు దూకేసింది. కిందపడిన మెహ్రీన్‌ను చూసిన తోటి స్నేహితులు బిగ్గరగా కేకలు వేసినా.. డ్రైవర్ గోవింద్ పట్టించుకోలేదని సోదరి ఆరోపిస్తున్నది. కింద పడ్డ మెహ్రీన్ తల పై నుంచి బస్సు ముందు, వెనుక టైర్లు వెళ్లిపోయాయి. దీంతో మెహ్రీన్ అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లేదుటే చెల్లి బస్సు చక్రాలు కింద నలిగి ప్రాణాలు కోల్పోవడంతో జువేరియా నిర్ఘాంతపోయి గుండెలవిసేలా రోదించింది. సమాచారం అందుకున్న మధురానగర్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, క్లూస్ టీంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మెహ్రీన్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నేను బస్సెక్కలేకపోయిన విషయాన్ని గ్రహించిన చెల్లెలు మసీరా మెహ్రీన్ బస్సును ఆపాలని డ్రైవర్‌ను అనేకసార్లు కోరింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో..చెల్లి మసీర మెహ్రీన్ నా కోసం బస్సు నుంచి రోడ్డు పైకి దూకింది. ఇది చూసి బిగ్గరగా కేకలు వేశా. బస్సు కింద చెల్లి పడి ఉందని అర్తనాదాలు చేసినా..డ్రైవర్ వినిపించుకోలేదు. యూసుఫ్‌గూడ నిమ్స్మేకు వెళ్లే మలుపు వద్ద వేగంగా అజాగ్రత్తలో నడిపి… చెల్లి ప్రాణాలు పోవడానికి డ్రైవరే కారణం. చెల్లి కింద రోడ్డు పై పడిన వెంటనే డ్రైవర్ బస్సు సడన్ బ్రేక్ వేసి ఆపితే..చెల్లి ప్రాణాలు దక్కేవి.