మున్సిపాలిటీ అధికారులకు జీహెచ్ఎంసీలో విలీనం కాసులు కురిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియాలో విలీనం తర్వాత నిబంధనలు మారి, పనులు కావని భయపెడుతూ..వినియోగదారుల నుంచి దండుకుంటున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కింది స్థాయి సిబ్బందిని ఉసిగొల్పి పనులు చక్కబెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి.
– మేడ్చల్, డిసెంబర్ 6
మేడ్చల్ నియోజకవర్గంలోని మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో మూడు జోన్ల పరిధిలోకి వెళ్లాయి. ఎల్బీనగర్లో జోన్ పరిధిలోకి పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపాలిటీ కార్పొరేషన్లు, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలోకి… సికింద్రాబాద్ జోన్ పరిధిలోని తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలు, జవహర్నగర్ కార్పొరేషన్ వెళ్లాయి.కూకట్పల్లి జోన్లోని గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీలు వెళ్లాయి. కాగా, పాత మేడ్చల్ మండలంలో కొత్తగా ఏర్పడిన ఎల్లంపేట, శామీర్పేటలో మండలంలో ఏర్పడిన ఆలియాబాద్, తూంకుంట మున్సిపాలిటీలను ప్రస్తుతానికి మున్సిపాలిటీలుగా ఉంచారు. ఆ మున్సిపాలిటీలను కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే నాటికి విలీనం చేస్తారన్న ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత పరిపాలన ఎలా ఉంటుందోనని ప్రజల్లో భయం నెలకొంది. ఏ జోన్ పరిధిలోకి వస్తాం? ఏ సర్కిల్లో ఉంటాం..? కార్యాలయం ఎక్కడ ఉంటుంది..? నిబంధనలు ఏ విధంగా ఉంటాయి..? పనులు ఎలా చేసుకోవాలి? అన్న ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదనుగా మున్సిపాలిటీ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని అనుమతులు పొందాలని, లేదంటే జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయని భయపెడుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఇంటి నంబర్లు, నిర్మాణ అనుమతులు కోసం కార్యాలయాలకు ప్రజలు క్యూ కడుతున్నారు. వారి ఆతృతను కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నంబర్లు, భవన నిర్మాణ అనుమతుల కోసం రూ. లక్షల్లో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీ చట్ట ప్రకారం.. 2020 వరకు ఉన్న డాక్యుమెంట్లకే మున్సిపాలిటీ అనుమతులు ఇచ్చే అధికారం ఉంది. కానీ కొందరు అధికారులు పాత తేదీల్లోవాల్యూడేషన్ డాక్యుమెంట్లు సృష్టించి, అనుమతులు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇలా 10వరకు జరిగినట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇలా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. కొత్తగా ఇచ్చిన ఇంటి నంబర్లు, అనుమతులను పరిశీలిస్తే అధికారుల అవినీతి బట్టబయలవుతుందని పలువురువ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.