బొల్లారం,జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం ప్యారడేజ్ నుంచి శామీర్‌పేట వరకు చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌తో కంటోన్మెంట్ వ్యాప్తంగా సుమారు 25 దేవాలయాలు కూల్చివేతకు గురవుతున్నాయని, తద్వారా విలువైన చారిత్రక సంపదను కోల్పోతామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. దేవాలయాల రక్షణకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని కోరారు. శనివారం కంటోన్మెంట్ బోయిన్పల్లి చిన్నతోకట్ట సంజీవని ఆంజనేయస్వామి ఆలయంలో సమితి ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమితి ఎగ్జిక్యూటివ్ టీఎన్. మురారి మాట్లాడుతూ.. ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణంలో పురాతన దేవాలయాలను కూల్చివేయడం తగదన్నారు. హిందువుల మనోభావాలు గౌరవించి దేవాలయాలు కూల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వం ఆలయాల కమిటీ సభ్యులతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తిరుమలగిరి మండలం చిన్న తోకట్ట న్యూ బోయిన్పల్లి సర్వే నంబర్ 75లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన 23 గుంటల భూమి విషయం హైకోర్టులో ఉన్నదన్నారు. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని, దీనిని తాము ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచన చేయాలని కోరారు. సమావేశంలో సమితి సభ్యులు మురారి,అనిల్ కుమార్, మన్నె శ్రీనివాస్, ముత్యాలమ్మ ఆలయ ప్రధాన పూజారి మహేశ్, రాజ్‌కుమార్, బాలకృష్ణ, నరేందర్‌గౌడ్, నర్సింగ్, ఆలయ ఈఓ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.