కందుకూరు, మే 25 : బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీశ్‌రావు చెప్పడం సమంజసమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం మండల పరిధిలోని తిమ్మాపూరు గ్రామంలో ఆమె మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం నాడు భూములను సేకరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారని, అప్పడు అక్కరలేని భూములు ఇప్పుడు అక్కరకు వచ్చాయా అని ప్రశ్నించారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదండరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సీతక్కలు ఇక్కడికొచ్చి, తాము అధికారంలోకి వస్తే భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పారని, వారు చెప్పినట్లుగా తిరిగి భూములను రైతులకు ఇవ్వకుండా ప్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం పద్ధతి కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందని దృష్టి మరిల్చి ప్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, లేమూరు గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాద్రెడ్డి, సీనియర్ నాయకులు సురుసాని సురేందర్‌రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, మాజీ సర్పంచ్ గంగాపురం గోపాల్‌రెడ్డి, తాండ్ర దేవేందర్, సరికొండ వెంకటేశ్ గౌడ్, సామ ప్రతాపరెడ్డి, జ్ఞానేశ్వర్, యాదగిరి, నర్సింహరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిమ్మాపూరు గ్రామానికి చెందిన ముద్దగౌని అంజయ్య గీతాకార్మికుడు, తాట్టిచెట్టు పై నుంచి ప్రమాద వశాత్తు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి గ్రామానికి చేరుకొని వారి ఇంటికి వెళ్లి మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళలు అర్చించి భార్యతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి మనోదైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంజయ్య మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.