మేడ్చల్, సెప్టెంబర్10 (నమస్తే తెలంగాణ): జీవో 58,59 దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. నివాస స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జీఓ 58 కింద 26,092 దరఖాస్తులు, జీవో 59 కింద 15,200 దరఖాస్తులు మొత్త 41,292 వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను 41 బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేసి పూర్తి చేశారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయినా ప్రభుత్వ నిర్ణయం కోసం దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.
జీవో 58,59 క్రమబద్ధీకరణపై ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే కొన్ని రోజుల కింద ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను తెరపైకి తీసుకొచ్చింది. గతంలో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో జిల్లా అధికార యంత్రాంగం వేగంగా పనిచేస్తున్న క్రమంలో జీవో 58, 59 దరఖాస్తుల పరిస్థితి ఏమిటని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.