GHMC | మేడ్చల్, జూన్ 27(నమస్తే తెలంగాణ): శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. శివారులో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో పీర్జాదిగూడ, నిజాంపేట, బొడుప్పల్, జవహర్నగర్లను కార్పొరేషన్లగా.. మేడ్చల్, గుండ్లపోచంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, తూంకుంట, దుండిగల్, కొంపల్లిలను మున్సిపాలిటీలుగా మార్చింది. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు.
శివారు ప్రాంత అభివృద్థికి విశేషంగా కృషి చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలోని 13 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్టేనని శివారు ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాగా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా వస్తున్న ఆదాయంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు అంచనాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.