ప్రజా తీర్పును శిరసావహించాలి… అధికారంలో కూర్చోబెడితే సేవ చేయాలి! ప్రతిపక్షంలో ఉంచితే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి!! కానీ ప్రజా తీర్పు ఎలా ఉన్నా… అధికారం వెనక పరిగెడతామంటే ఏమవుతుంది?! కండువా మార్చినప్పుడు ఉత్సాహంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాతే ఎరక్కపోయి ఇరుక్కుపోయామా? అని సాంగ్ వేసుకోవాల్సి వస్తుంది… ఇదీ మహా నగరంలో జంప్ జిలానీలపై ప్రజాక్షేత్రంలో జరుగుతున్న చర్చ.
ఓటరు వేలిపై సిరా చుక్క ఆరకముందే బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల గుండెల్లో ఇప్పుడు దడ మొదలైంది. గురువారం సుప్రీం తీర్పు నేపథ్యంలో మహా నగరంలో రాజకీయం రంజుగా మారింది. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వైపు రాజకీయ పార్టీలు దృష్టిసారించిన నేపథ్యంలో తాజా సుప్రీం తీర్పుతో అసలు మహా నగరంలో ఉప ఎన్నికలు జరగనున్నవి… ఒకటా? ఆరా? అనే చర్చ జోరందుకున్నది
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర రాజకీయంలో ఉప ఎన్నికలపైనే ప్రధాన చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్‌కు ఉప ఎన్నికలు జరగనున్న దరిమిలా అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ఆ దిశగా ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. కానీ అనూహ్యంగా గురువారం ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటీషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం సూచించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశం చిన్నదైపోయింది.
దీంతో పాటు ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయనే దానిపైనే జనం చర్చించుకోవడం కనిపించింది. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా నగర ఓటర్లు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించకుండా కొందరు ఎమ్మెల్యేలు వెంటనే పార్టీ ఫిరాయించారు. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, పటాన్చెరు ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి కండువా మార్చారు.
దానం నాగేందర్ ఒకడుగు ముందుకేసి లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నాలుగైదు నెలల ముందు గులాబీ కండువాతో ఓట్లడిగిన నేత పార్టీ అధికారం పోగానే వెంటనే అధికార పార్టీ కండువాతో తిరిగి ఓటర్ల ముందుకు రావడంపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈయనతో పాటు ఇతర ఎమ్మెల్యేలపైనా జనం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆరుకు మార్గం సుగమమా?
సుప్రీం తీర్పుతో హైదరాబాద్ మహా నగరంలో జూబ్లీహిల్స్‌తో పాటు జంప్ జిలానీల నియోజకవర్గంలోనూ ఉప ఎన్నికలు వచ్చినట్లేనని పలువురు అంచనా వేస్తున్నారు. సుప్రీం తీర్పు స్పష్టంగా ఉన్న దరిమిలా కచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎలాగూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి డిసెంబరులోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
సుప్రీం కోర్టు స్పీకర్‌ను మూడు నెలల్లోపు తేల్చాలని సూచించినందున ఆ ఐదు నియోజకవర్గాలు కలుపుకొని ఆరు అసెంబ్లీ స్థానాల్లో నగరా మోగేందుకు మార్గం సుగమం అయిందనే చర్చ సాగుతున్నది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని అంటున్నారు. అధికారంలో పోతే ఉన్న సీటుకే ఎసరు వస్తే ఎలా? అని వాళ్లలో అంతర్మథనం మొదలైందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ ప్రజల ముందుకు పోతే ఎలా స్వీకరిస్తారోనన్న దడ వారిలో మొదలైందని తెలుస్తున్నది.
సర్కారుపై వ్యతిరేకతతో సతమతం…
అధికారం కోసం పార్టీ కండువా మార్చినా.. తమకు దక్కిందేముందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు మదనపడుతున్నట్లు వాళ్ల అనుచరులే అంటున్నారు. 18 నెలల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి తాము సాధించింది ఏమీలేకపోగా… ప్రభుత్వంపై వ్యతిరేకతతో తమ పరిస్థితి పీకల్లోతుల్లో మునిగిపోయినట్లు తయారైందంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిత్యం ఏదో ఒక అభివృద్ధి ప్రాజెక్టు ప్రజల కండ్ల ముందు కనిపించేది.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టును పూర్తి చేసిన దాఖలాలు లేవు. పైగా హైడ్రాతో పేదోళ్ల ఇండ్లను కూల్చడం మినహా నిర్మాణాత్మకంగా సాధించిందేముంది… మూసీ కూల్చివేతలతో పాటు లగచర్ల, ప్రభుత్వ పెద్దల సన్నిహితుల భూ పందేరాలు, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు పంపిణీ చేయకపోవడం, అధ్వానంగా మారిన పారిశుధ్యం, గాడితప్పిన శాంతిభద్రతలు… ఇలా జాబితా చాంతాడంత తయారవడంతో ప్రజల ముందుకు ఏమని పోవాలె? అని ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాదు..వారి బాటలో నడిచిన అనుచరులు సైతం నెత్తి పట్టుకునే పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తున్నది.