సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన పేరిట జరుగుతున్న వేల కోట్ల రూపాయల పనుల్లో నాణ్యత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా పకదారి పట్టింది. విద్యార్థులకు ప్రాక్టికల్ వర్ షాప్లు, ఫీల్డ్ అనుభవం కల్పిస్తామనే సాకుతో ఇంజినీరింగ్ కళాశాలలకు అప్పగించిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సేవలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.
కాగా జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లు, 30 ఇంజినీరింగ్ డివిజన్లలో రూ. 5 లక్షల కంటే ఎకువ విలువైన సివిల్ పనులు (బీటీ రోడ్లు, సీసీ పేవ్ మెంట్లు, వరదనీటి కాలువలు, బిల్డింగులు, బ్రిడ్జిలు) తనిఖీ చేసేందుకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. నిబంధనల ప్రకారం 10 కిలోమీటర్ల పరిధిలో ఉండి, పదేళ్ల అనుభవంతో పాటు ఏఐసీటీఈ, ఎన్బీఏ, న్యాక్ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలే ఇందులో పాల్గొనాలి.
అయితే, నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వర్సిటీలైన జేఎన్టీయూహెచ్, ఉస్మానియాలు ఈ టెండర్లకు దూరంగా ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని రంగంలోకి దిగిన 11 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు ముందస్తుగానే ఒక హోటల్ లో సమావేశమై సిండికేట్గా మారినట్లు తెలుస్తోంది. మొత్తం 12 సె్లైస్ లుగా విభజించిన ఈ టెండర్లలో పోటీ లేకుండా, అందరూ ఒకేతాటిపైకి వచ్చి 0.4 నుంచి 0.5 శాతం లోపే బిడ్లు దాఖలు చేసి టెండర్లను దకించుకోవడం ఇంజినీరింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గతంలో కమిషనర్ జనార్ధన్ రెడ్డి హయాంలో.. సివిల్ ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు లైవ్ ప్రాజెక్టులపై అవగాహన, క్షేత్రస్థాయి అనుభవం వస్తుందనే సంకల్పంతో ఈ వ్యవస్థను తెచ్చారు. కానీ నేడు ఆ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. ఏ ఒక కాలేజీ కూడా తమ విద్యార్థులను ఫీల్డ్ వర్కు పంపడం లేదు. కొన్ని కళాశాలల్లో కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో, మరికొన్ని చోట్ల ఒకే ఒక ఉద్యోగితో మొత్తం వ్యవస్థను నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థల(ఎన్బీఏ, న్యాక్) గుర్తింపు కోసం థర్డ్ పార్టీ అనుభవం చూపించుకోవడానికే కాలేజీలు ఈ పనులను వాడుకుంటున్నాయే తప్ప, క్వాలిటీ చెకింగ్ చేయడం లేదని కాంట్రాక్టర్లే బహిరంగంగా చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, టెండర్లు దకించుకున్న అనేక ఇంజినీరింగ్ కాలేజీల్లో సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నాణ్యతను పరీక్షించే కోర్ కటింగ్ పరికరాలు కూడా లేవు. దీంతో వారు ఈ కీలక పరీక్షల కోసం మళ్లీ ఇతర ప్రైవేట్ ఏజెన్సీలపై ఆధారపడుతుండడం గమనార్హం.
మరోవైపు, నాణ్యత పరీక్షల కోసం ఫోర్త్ పార్టీ ఏజెన్సీల ఎంపానెల్మెంట్ పేరిట ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ప్రయోగశాలలను ఎంచుకుంటున్నారు. ఎన్ఏబీఎల్ గుర్తింపు అనేది నిర్దిష్ట పరీక్షలకు (ఉదాహరణకు కేవలం కాంక్రీట్ లేదా మట్టి పరీక్షలు) మాత్రమే వర్తిస్తుంది. ఆ పరిధి లేకపోయినా కొన్ని ల్యాబ్ లను ఎంపిక చేయడం ఎన్ఏబీఎల్ లోగో లేని సాధారణ నివేదికలను జారీ చేస్తుండటంతో నాణ్యత పర్యవేక్షణ కేవలం తూతూ మంత్రంగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి.
కాగా, థర్డ్ పార్టీ రిపోర్టులు సరిగ్గా రాకపోయినా, అసలు రిపోర్టులే లేకుండానే బిల్లులు మంజూరవుతున్న ఘటనలు ఉన్నాయి. దీనివల్ల కాంట్రాక్టర్లకు జరిమానాలు పడకపోగా, ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది. ప్రస్తుత లోపభూయిష్ట నాణ్యత నియంత్రణ వ్యవస్థపై ప్రభుత్వం తక్షణమే ఉన్నతాధికారులు, బీఐఏఎస్ ప్రతినిధులు, అక్రెడిటేషన్ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని వేసి సమగ్ర సమీక్ష జరపాలని రంగ నిపుణులు,నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.