Agriculture University | వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 04 : చిరుధాన్యాల ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని కేంద్ర వ్యవసాయ సహాయ శాఖ మంత్రి భగీరథ చౌదరి అన్నారు. సోమవారం జాతీయ చిరుధాన్యాల కిసాన్ మేళాను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. భారతీయ చిరుధాన్యాల సంస్థ (ఐసీఏఆర్- ఐఐఎంఆర్)సంచాలకురాలు తారా సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం జరిగింది.
భారత్‌లో చిరుధాన్యాల సాగుకు వాతావరణ పరిస్థితులు, నేలలు అనుకూలమని పలువురు వీసీలు, డైరెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో వర్షాధారంపై చిరుధాన్యాలే ఎక్కువగా పండించేవారని, కరోనా అనంతరం చిరుధాన్యాల ఉత్పత్తులకు అధిక డిమాండ్ పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దేశంలో గల వివిధ రాష్ట్రాల నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ సదస్సుకు హాజరుకావడం అభినందనీయమన్నారు. చిన్న కమతాలు ఉన్నాయని దిగులు చెందకుండా చిరుధాన్యాల సాగు మంచిగా పండించి ఆ ఉత్పత్తి దారులకు, ఎక్కువ ధరలు చెల్లించే వారికే విక్రయించాలని ఆయన సూచించారు.
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం వల్ల పర్యావరణ పరిరక్షణ, వేసవిలో సైతం వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకుని అధిక దిగుబడులు పొందవచ్చని చిన్న, సన్నకారు రైతులకు చిరుధాన్యాల సాగు వరమని యూనివర్సిటీ వీసీ డా. అల్ధాస్ జానయ్య పేర్కొన్నారు. చిరుధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అధిక ధరలు దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు.
ప్రత్యేక హాల్లో బి2బి స్టాల్స్ ఏర్పాటు చేయడంతో దాదాపు 1500 క్వింటాళ్ల వరకు సామలు, కొర్రలు , సోయాచిక్కుడు, జొన్న, రాగి, సజ్జ, కంది ధాన్యాన్ని ఎక్స్‌పోర్టు దారులు బుక్ చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించారు.
కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ పీఆర్ జీడి నరేంద్రనాద్, కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డా.రాజిరెడ్డి, మిల్లెట్స్ సీఈఓ దయాకర్, ఎన్‌ఐపిహెచ్‌ఎం, ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఈ సంస్థ డైరెక్టర్లు, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.