Jalamandali | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : వేసవి తాపం నుంచి గట్టెక్కించేందుకు జలమండలి ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు, పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో 70, జీహెచ్ఎంసీ పరిధిలో 31 కలిపి మొత్తం 101 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే నాలుగు కేంద్రాలను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు.
మక్కా మసీదు వద్ద వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వాటర్ బాటిల్స్, ప్యాకెట్ల ద్వారా నీరు అందజేస్తామని, మసీదులు ఉన్న ఇతర ప్రాంతాల్లో జలమండలి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. చలివేంద్రాల ఏర్పాటుతో తాగునీటితో పాటు మురుగు నీటి నిర్వహణ కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. సీవరేజీ ఓవర్ ఫ్లో కాకుండా ఉండేందుకు మ్యాన్హోళ్లను శుభ్రం చేయనున్నామని చెప్పారు.