కేపీహెచ్బీ కాలనీ, మార్చి 27: దొంగతనం చేయడంలో ముంబైలో శిక్షణ పొంది పలు దొంగతనాలు చేసిన ఓ వ్యక్తి.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కేపీహెచ్బీ కాలనీ పరిధిలో దొంగిలించిన 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్ కు తరలించారు. కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ లో కూకట్పల్లి ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడుకు చెందిన జీవ గణేషన్ (26) బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, ఇస్నాపూర్ కు చేరుకున్నాడు.
మేస్త్రీ పనులు చేస్తుండగా, ముంబై నగరానికి చెందిన కుమార్ తో పరిచయం ఏర్పడింది. మేస్త్రీ పనులతో ఎక్కువ డబ్బు సంపాదించలేమని, ముంబైకి వస్తే దొంగతనాలు నేర్పిస్తానని కుమార్ చెప్పగా, అతడి మాటలు నమ్మిన జీవ గణేషన్ ముంబైకి చేరుకొని దొంగతనాలకు అలవాటు పడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు నివసించే ఏరియాలను ఎంచుకొని… ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు దొంగిలిస్తూ వాటిని ఇస్నాపూర్ సమీపంలోని తోతానం గ్రామంలో రాజేందర్ అనే వ్యక్తికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కాగా, ఈనెల 23న కేపీహెచ్బీ కాలనీ1, 3వ ఫేజ్ లలో రెండుచోట్ల ల్యాప్టాప్లను దొంగిలించి పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చివరకు దొంగతనం చేసిన వ్యక్తి జీవ గణేషన్ గా తేల్చి పట్టుకున్నారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 ల్యాబ్ టాప్లను దొంగిలించినట్లు తేల్చారు. అతడి వద్ద కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన 4 ల్యాప్ టాప్స్ లను కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన రెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇతను మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 3 ల్యాబ్ టాప్ లను దొంగతనం చేసినట్లు పోలీసులు తేల్చారు. 2.5 లక్షల విలువైన 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి శిక్షణ ఇచ్చిన కుమార్ చనిపోగా, అతడి వారసత్వాన్ని కొనసాగిస్తూ జీవ గణేష్ పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించాడు.