సిటీబ్యూరో : ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన దాదాపు మూడున్నర లక్షల అర్జీలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, జీపీ లే అవుట్ల నిషేధం వంటి చర్యలతో దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదు. హైడ్రా అందుబాటులోకి రావడంతో ఇప్పటికే ఫీజులు చెల్లించిన దరఖాస్తుదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. తాజాగా జీపీ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో… ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది.
హెచ్ఎండీఏ పరిధిలో పెండింగ్లో ఉన్న 3.60 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.ఇందులో 1.16 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. వీటిలో 1.12 లక్షల దరఖాస్తుల్లో ఉన్న లోపాలను వివరిస్తూ అధికారులు షార్ట్ ఫాల్ చేయగా… 653 అర్జీలను తిరస్కరించారు. ఇప్పటికే ప్రిలిమినరీ ఎలిమినేషన్ ప్రక్రియ ముగియగా… ఫీజులు చెల్లించిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ ఫాల్స్ పేర్కొంటూ దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు అధికారులను గందరగోళంలో పడేస్తున్నాయి. దీంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లను క్రమబద్ధీకరించి, ఆయా ప్లాట్లుకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. కానీ ప్రతిపక్ష హోదాలో అప్పటి సర్కారు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అక్కడితో ఆగకుండా… అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేసి ఇస్తామంటూ హామీ ఇచ్చింది. అలా అధికారం చేపట్టిన తర్వాత పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఖజానా నింపే కామధేనువుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దరఖాస్తులను వేగంగా పరిశీలించాలనే ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ పేదలపై ఆర్థిక భారం పడుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తున్నది.