మేడ్చల్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. గుంతల మయమైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా రోడ్లకు మరమ్మతులు చేసేందుకు మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.
రోడ్ల మరమ్మతులు చేయాలంటూ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు లేవంటూ అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. ప్రభుత్వానికి నిధుల మంజూరికి నివేదిక సమర్పించమని నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేపడుతామని చెప్పి పంపుతున్నారు. నిధులను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తారు ఎప్పుడు మరమ్మతులు పనులు ప్రారంభిస్తారంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని బొడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్, పీర్జాదిగూడ, మేడ్చల్, గూండ్లపోచంపల్లి, తూంకుంట, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, దుండిగల్, కొంపల్లిల మున్సిపాలిటీల పరిధిలో అంతర్గత రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది.
మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధి, రోడ్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరికి రూ. 20 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినా.. ఇంత వరకు ప్రభుత్వం నిధులను మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మున్సిపాలిటీలకు ఒక్క రూపాయిని కూడా మంజూరు చేయలేదు. మున్సిపాలిటీలకు వచ్చిన ఆస్తిపన్నులు, ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా వచ్చిన ఆదాయంతో మున్సిపాలిటీల నిర్వహణ కొనసాగుతున్నది.