మలక్‌పేట, అక్టోబర్ 9: ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోమవారం రాత్రి మలక్‌పేట పోలీసులు గడ్డిఅన్నారం చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మలక్‌పేట ఇన్స్పెక్టర్ గుంజె శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఐ జయరాం, ఎస్ఐలు నవీన్, జయంత్, సురేశ్, కిరణ్లాల్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆటోలు, కార్లు మినీవ్యాన్లు, గూడ్స్ వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత పంపించారు. కాగా వాహనాల్లో ఎలాంటి వస్తువులుగానీ, నగదుగానీ లభించలేదని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఎన్నికల రూల్స్(నియమావళి)ని పాటించాలని, మద్యం, నగదు తరలింపు విషయంలో వాటికి సంబంధించి సరైన ఆధారాలు, అనుమతి పత్రాలు తప్పనిసరి ఉండాలని లేనిపక్షంలో సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేస్తామని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని శ్రీనివాస్ హెచ్చరించారు.
సైదాబాద్, అక్టోబర్ 9: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోర్డ్ ఆఫ్ కండక్ట్ అమలు కావటంతో, ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం శనివారం రాత్రి సైదాబాద్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకేశ్వరబజార్ చౌరస్తాలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయటంతోపాటు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ కె.రాఘవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు అనుమానిత వ్యక్తులను, ద్విచక్రవానాలను, కార్లను క్షుణంగా తనిఖీలు చేసిన అనంతరం పంపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెండు జిల్లాలకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టు, పోలీస్ పికెట్లను ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా చంపాపేట ప్రధాన రహదారి గ్రీన్‌పార్క్ కాలనీ కమాన్ వద్ద, అలాగే శంకేశ్వరబజార్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంతవరకు పోలీస్ చెక్ పోస్ట్‌లు, పికెట్లు ఉంటాయని అనుమానిత వ్యక్తులను, వాహనాలను తనిఖీలు నిర్వహించటం జరుగుతుందని తెలిపారు.