సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు సిటీలోనే ఉన్నారా.. లేక సిటీ వదిలి పారిపోయారా? అనేది ప్రస్తుతం పోలీసుల ముందున్న సవాల్‌గా చెప్పాలి. ఏటీఎం వద్ద రిన్షద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు అక్కడినుంచి ఆటోల ద్వారా బార్కస్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారి జాడ దొరకడం లేదు. పది బృందాలు, 300 సీసీ కెమెరాలు.. ఇన్ని పరిశీలించినా ఆ ఇద్దరు ఎక్కడ అనేది మాత్రం తేలడం లేదు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించే దిశగా వివిధ రకాలుగా ప్రయత్నించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
నగరంలోనే ఉన్నారా..?
ముఖ్యంగా కాల్పులు జరిపి దోపిడీ చేసిన వెంటనే అక్కడినుంచి పరారై కాచిగూడ స్టేషన్లోకి వెళ్లినట్లుగా సీసీ పుటేజీలో గుర్తించారు. రైల్వే స్టేషన్లోకి వెళ్లి మళ్లీ కొద్దిసేపటికే బయటకు వచ్చి అక్కడికి దగ్గరలో ఉన్న డీమార్ట్ స్టోర్స్‌కు వెళ్లి అక్కడ దుస్తులు మార్చుకున్నట్లుగా మరో ఫుటేజీలో పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. ఆ తర్వాత ఆటోలో ఒక రోజంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో తిరిగి తెల్లారి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు చేసే క్రమంలో పోలీసులను తప్పుదారి పట్టించేందుకే వారు ఇలా చేసినట్లుగా ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే బార్కాస్ వరకు వెళ్లిన ఆ ఇద్దరు అక్కడినుంచి సిటీ దాటకుండా దగ్గరలోనే తమకు సంబంధించిన వారి వద్ద తలదాచుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేరే ప్రాంతాలకు వెళ్తే ఖచ్చితంగా పోలీసుల నిఘాలో ఎటువైపు వెళ్లారనేది తెలుస్తుందని, అందుకే వారు సిటీలోనే ఉండొచ్చని పోలీసు ఉన్నతాధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. పాతబస్తీలో ఉంటే వారికి షెల్టర్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, హవాలా కోణంలో కూడా వారికి అక్కడ సహకరించే వారు ఉంటారని ఆ అధికారి చెప్పారు.
సాంకేతిక ఆధారాలు వదల్లేదు
శనివారం ఉదయం కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల ఘటనలో స్కూటీపై నగదుతో సహా పరారైన దుండగులు కాచిగూడ స్టేషన్ సమీపంలోని శ్యామ్‌బాబా మందిరం వద్ద స్కూటీని వదిలి స్టేషన్ లోపలకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు రైలు ఎక్కి వేరే ప్రాంతాలకు పారిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేశారు. కానీ కొద్ది సేపటి తర్వాత వారు స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కారు. అక్కడినుంచి పలు ఆటోలు మారుతూ కాచిగూడ నుంచి చాంద్రాయణగుట్ట, బార్కస్ వైపు వెళ్లారు. ఆటోలలో ప్రయాణించే క్రమంలో వారు కనీసం ఆటో బుకింగ్ కానీ, డబ్బుల చెల్లింపుకు సంబంధించిన ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి వాడకుండా నేరుగా డబ్బులు చెల్లించినట్లు పోలీసుల విచారణలో ఆటోడ్రైవర్లు చెప్పారు. దీంతో ఆ ఇద్దరు దుండగులు ఎక్కడా సాంకేతిక ఆధారాలు వదలకుండానే పక్కాప్లాన్‌తో తిరిగినట్లు పోలీసులు చెప్పారు. ఇక కాల్పుల్లో గాయపడిన రిన్షద్‌ను ప్రశ్నిస్తే అతని నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం సీసీ ఫుటేజీలతోపాటు డేటా నెట్వర్క్ ఆధారంగా వారి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హవాలా కోణంలో..!
కాల్పుల ఘటనలో గాయపడిన రిన్షద్ వ్యవహారంపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 25 రోజుల క్రితం కేరళ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తులు ఇక్కడే ఒక రూమ్‌లో ఉన్నారని తెలిసింది. రిన్షద్ దగ్గర ఉన్న స్కూటీ అమీర్ అనే వ్యక్తిది కాగా అతను నాలుగునెలల క్రితమే నగరం నుంచి వెళ్లిపోయారని, మరి అతని బండి రిన్షద్కు ఎక్కడినుంచి వచ్చిందనే ప్రశ్న వ్యక్తమవుతోంది. దీనివెనక పెద్ద ఎత్తున హవాలాకు సంబంధించిన వ్యవహారం ఉండి ఉండవచ్చని, అయితే రిన్షద్‌ను ప్రశ్నించినప్పుడు అతను సరిగా సమాధానాలు చెప్పకపోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడుతోంది. ఈ కేసు పూర్తిగా రిన్షద్ కోణంలోనే విచారిస్తే అసలు దొంగలు బయటపడతారని, ఆ ఇద్దరు దొంగల వ్యవహారం కూడా వెలుగుచూస్తుందని దర్యాప్తు బృందాలు అభిప్రాయపడుతున్నాయి. డబ్బులు రైలులో తెచ్చినవారు తిరిగి ఏటీఎంలో వేయాల్సిన అవసరం ఏంటని, అంతేకాకుండా కాల్పులు జరిపిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని వారు అనుకుంటున్నారు. ఈ విషయంలో ఒక స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని, నిందితులు ఖచ్చితంగా సిటీ దాటి వెళ్లలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.