మేడ్చల్, సెప్టెంబర్ 14: స్వరాష్ట్రంలో పచ్చదనం వికసిస్తున్నది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల మానసిక ఆహ్లాదమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పట్టణాలకు పరిమితమైన పార్కుల సంస్కృతిని పల్లెకు పరిచయం చేసింది. జనం సేద తీరేందుకు, ఆహ్లాదంగా గడపడానికి పల్లె ప్రకృతి వనాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనం, మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పల్లె ప్రకృతి వనాలతో పల్లెల్లో పచ్చదనం పరిఢవిల్లింది. హరితహారంలో నాటిన మొక్కలతో పాటు పల్లె ప్రకృతి వనాలు పర్యావరణ పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. నగర శివారులో ఉన్న మేడ్చల్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో పచ్చదనం కనువిందు చేస్తున్నది.
1.40 లక్షల మొక్కల పెంపకం
మేడ్చల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 61 పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీల పరిధిలో 73 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. మేడ్చల్ మండలంలో 17 పంచాయతీలు ఉండగా 22 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అలాగే ఘట్కేసర్లో 11 పంచాయతీలకు గాను 18 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఇలా ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో దాదాపు 1.40 లక్షల మొక్కలను నాటి సంరక్షించారు.
బృహత్ పల్లె ప్రకృతి దిశగా అడుగులు..
మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఐదు బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. పల్లె ప్రకృతి వనాలు పావు ఎకరా నుంచి మొదలుకొని ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేయగా… బృహత్ పల్లె ప్రకృతి వనాలను మాత్రం నాలుగైదు ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మేడ్చల్ మండలంలో శ్రీరంగవరం, కీసరలో చీర్యాల్‌లో, ఘట్కేసర్లో కాచవానిసింగారం, మూడుచింతలపల్లిలో జగన్‌గూడలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగైదు ఎకరాల స్థలంలో వేలాది మొక్కలు నాటి, అటవీ వాతావరణం సృష్టించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ పంచాయతీ పరిధిలో నాలుగు ఎకరాల్లో, ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాలు అటవీ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఉపయోగాలెన్నో…
పల్లె ప్రకృతి వనాలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రకృతి ప్రేమికులు, నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపులో భాగంగా ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని అంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపే అవకాశం గ్రామీణ ప్రజలకు పల్లె ప్రకృతి వనాల ద్వారా లభించింది. స్థలం అందుబాటులో ఉన్న చోట వాకింగ్ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకుండా జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రకృతి వనాలు దోహదం చేస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. వివిధ రకాల పక్షులు, జీవులు తమ మనుగడను కొనసాగించడానికి ఈ వనాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.
వృద్ధి చెందిన వృక్ష సంపద
పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు పెరిగి పెద్దవిగా మారి, వృక్ష సంపద వృద్ధి చెందింది. నాటిన పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు ఏపుగా పెరిగి, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పలుచోట్ల జామ, మామిడి, బొప్పాయి, సీతాఫలాలు ప్రకృతి వనాల నుంచి లభిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో కోతుల బెడద నుంచి తప్పించుకునే అవకాశం ఏర్పడింది. పచ్చదనం పెరగడంతో ఆక్సిజన్ స్థాయి పెరిగిందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
పల్లె ప్రకృతి వనాలు పర్యావరణానికి తోడ్పడుతున్నాయి. పచ్చదనం పెరగడంతో వాతావరణంలో వేడి తగ్గి, వర్షాలు బాగా కురిసే అవకాశం ఏర్పడింది. జామ, బొప్పాయి, సీతాఫలాలు లభిస్తున్నాయి. ప్రజలు ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. నగరానికి దగ్గరగా ఉన్న నియోజకవర్గంలో ప్రకృతి వనాల కారణంగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే భాగ్యం దక్కింది. ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులతో మమేకమై పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం.
– పద్మావతి, ఎంపీడీవో, మేడ్చల్
పచ్చదనం పెంపునకు ప్రత్యేక శ్రద్ధ
ప్రభుత్వం పచ్చదనం పెంపునకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. హరితహారంలో భాగంగా ప్రకృతి వనాల ఏర్పాటు, రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలతో పాటు ప్రతి ఇంచు ఇంచున మొక్కలు నాటడం, ప్రతి చోట బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన కారణంగా తెలంగాణ పచ్చగా కన్పిస్తున్నది. వాతావరణంలో పెనుమార్పులు వచ్చాయి. 17 శాతం పచ్చదనం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. పచ్చదనం పెంపులో భాగంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో పెంచిన పూలు, పండ్లు, ఔషధ మొక్కలు మంచి ఫలితాలనిస్తున్నాయి. మండలంలో పలుచోట్ల వాకింగ్ ట్రాక్‌లు కూడా ఏర్పాటు చేశాం. తద్వారా ప్రజలు పచ్చని చెట్ల మధ్య సేద తీరే అవకాశం ఏర్పడింది.
– వత్సలాదేవీ, ఎంపీడీవో, మూడుచింతలపల్లి
గ్రామానికి వరం..
పల్లె ప్రకృతి వనం గ్రామానికి వరం లాంటింది. అంతరించిపోతున్న పక్షులు, జంతువులకు ఆవాసంగా ఉపయోగపడటమే కాకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తున్నాయి. గ్రామంలో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న కోతులకు ఫుడ్ కోర్టులుగా ఉపయోగపడుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న ఈ నిర్ణయానికి సెల్యూట్.
-చిట్టిమిల్ల గణేశ్, సర్పంచ్, మునీరాబాద్, మేడ్చల్
8 ఎకరాల్లో ఏర్పాటు చేశాం..
గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని 8 ఎకరాల్లో ఏర్పాటు చేశాం. ప్రజల సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్‌ను నిర్మించాం. రూ.10 లక్షలతో 2 బోరు బావులను తవ్వించి, వాటర్ లైన్ వేయించా. రూ.30 లక్షలతో ప్రహరీని నిర్మించా. దాతలు విరాళాలతో పాటు పంచాయతీ నిధులు రూ.10 లక్షలతో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశా. ప్రకృతి వనంలో జామ, మామిడి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, చింత, అల్లనేరేడు, సీతాఫలం తదితర 18వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. గ్రామస్తులు నిత్యం ఇక్కడికి వచ్చి ఉదయం వాకింగ్ చేస్తున్నారు. మరిన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నా.
– కొంతం వెంకట్ రెడ్డి, సర్పంచ్, కాచవాని సింగారం