సిటీబ్యూరో, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : నార్త్ సిటీ మెట్రో సాధనలో కమ్యూనిటీ భాగస్వామ్యానికి మేడ్చల్ మెట్రో సాధన సమితి సన్నాహాలు చేస్తోంది. 30 లక్షల మంది జనావాసం ఉండే ఈ ప్రాంతానికి మెట్రో ఆవశ్యకతను తెలుపుతూ, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. డీపీఆర్ కేంద్రానికి చేరి 8 నెలలు గడిచినా..ఇప్పటికీ ఏ ఒక్క కారిడార్నూ ఆమోదించలేదు.
ఇక బీజేపీ ఎంపీలను కలిసి మెట్రో ఆమోదానికి ఒత్తిడి చేస్తున్నా… తెలంగాణ మినహా అన్ని మెట్రోలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది. కానీ హైదరాబాద్ నగర వాసులను ఇబ్బందులను పట్టించుకున్నవారే లేకుండా పోయారు. ఈ క్రమంలో మెట్రో సాధన కోసం మేడ్చల్ మెట్రో సాధన సమితి ఉద్యమ కార్యాచరణతో కదలిక తీసుకువచ్చేలా చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు జాప్యంతో మేడ్చల్ పరిసర ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విస్తృత ప్రచారం చేయాలని భావిస్తున్నది.
ఇందులోనే భాగంగా శాంతియుత ధర్నాలు, అవగాహన సదస్సులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. ‘ప్రజావసరాల విషయంలో పార్టీలు, ప్రాంతాలకతీతంగా ప్రభుత్వ విధివిధానాలు ఉండాలి. కానీ తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునేలా మెట్రో విషయంలో కేంద్రం జాప్యం సరైన విధానం కాదు.
ఈ విషయంలో ఢిల్లీ స్థాయిలో మేడ్చల్ మెట్రో సాధన అవశ్యకతను తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించాలని జేఎసీ అభిప్రాయపడుతున్నది’ అని సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ సంపత్ కుమార్ తెలిపారు. నిధులు, పారిశ్రామిక పెట్టుబడులు, ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.