Congress | సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్ : గ్రేటర్‌లోని ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ జెండా రెప రెపలాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ జెండా విల విలాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. దీంతో అక్కడ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా రాగిడి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, సోమిరెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరు ఎవరికి వారే తమ గాడ్ ఫాదర్ల ద్వారా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొంతమంది నేతలు టికెట్ కోసం ఢిల్లీకి సైతం వెళ్లి, తమ నేతలతో పైరవీలు చేస్తున్నారు. టికెట్‌పై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారు తమ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరికి మాత్రమే అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన ఇద్దరు అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
గ్రూపులతో అయోమయం
పార్టీ ప్రచారం, గ్యారెంటీ పథకాల ప్రచారంలో గ్రూపులుగా విడిపోయి ప్రచారాలు చేసుకుంటున్నారు. డివిజన్ల వారీగా గ్రూపులుగా వచ్చి ప్రచారాలు చేస్తుండటంతో కార్యకర్తలు, ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. టికెట్ ఆశిస్తున్న నేతలు తమ తమ అనుచర వర్గంతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాం గ్రెస్ పార్టీ క్యాడర్ వచ్చే ఎన్నికల్లో కలిసి మెలిసి పనిచేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. గతంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఫ్లెక్సీ కొట్లాట జరిగింది. వీరిపై పోలీసు కేసులు కూడా నమోదు చేసుకోవడం గమనార్హం. అయితే ఉప్పల్‌లో బీఆర్ఎస్పార్టీ బలంగా ఉండటంతో పోటీ చేయడానికి ప్యారాచూట్ నేతలు వస్తారని ప్రచారం సాగుతుంది.
ఇదీ చరిత్ర…
2009లో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంగా మారింది. నాటి నుంచి లెక్కిస్తే ఒక్క సారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పది డివిజన్లలో పోటీ చేస్తే ఒక్క డివిజన్లో స్వల్ప మెజారిటీతోనే ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు. మిగితా తొమ్మిది డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగురువేశారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కూడా లేకపోవడంతో క్యాడర్ పూర్తిగా నిరుత్సాహంలోకి వెళ్లింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న బండారి లక్ష్మారెడ్డి 2018లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా, మిగితా 8 చోట్ల కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. రెండవ స్థానంలో కూడా నిలువలేకపోయింది. 2018లో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇదే స్ఫూర్తితో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఉప్పల్ నియోజక వర్గంలో గులాబీ పార్టీ జెండా ఎగురుతుందని స్థానిక ఓటర్లు గట్టి నమ్మకంతో ఉన్నారు.