మేడ్చల్, జనవరి27(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్పల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంగళవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు వెంకటేశ్‌గౌడ్, మల్లేశ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభాకర్‌రెడ్డితో పాటు 20 మంది కార్యకర్తలు పార్టీలో చేరగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్‌కు చెందిన గుంటి చిన్న కుమార్, గుంటి భాస్కర్, అన్నారం శ్వామ్కుమార్, గంటి నర్సింగ్‌రావు, సంచు లింగం, జక్కుల ప్రవీణ్, జక్కుల వంశీ, బోయిని సత్యనారాయణ, అన్నారం నర్సింహ, జక్కుల శోభ, జక్కుల భిక్షపతి, జక్కుల కృష్ణ, ఉప్పరి సత్తయ్య, గుంటి మహేందర్‌తో పాటు 100 మంది మహిళలు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్‌పల్లిలో ముందుగా మాజీమంత్రి మల్లారెడ్డి చేతులమీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ప్రజలు బేజార్ అవుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అద్రాస్‌పల్లిలో ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎ ఒక్క హామీని అమలు చేయడంలేదన్నారు. వారి మోసపూరిత హామీలను ప్రజలు గుర్తించి ఇప్పుడు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారన్నారు. జిల్లాలో జరగనున్న మూడు మున్సిపాలిటీల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.