సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : కంచె చేను మేసినట్లుగా.. జలవనరులను పరిరక్షించాల్సిన హెచ్ఎండీఏ లేక్ విభాగం ఇప్పుడు ఆ రికార్డులను తారుమారు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల పేరిట, చెరువుల రికార్డులను ఆన్లైన్ పోర్టల్‌లో లేకుండా మాయం చేసి, అంతలోనే ప్రత్యక్షం చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం కంటే.. చాటుమాటు వ్యవహారాల వెనుక నగరంలో జలవనరులకు పెద్ద ప్రమాదమే పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన ఏడాది కాలంగా హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల హద్దుల నిర్ధారణ వ్యవహారాలను హైకోర్టు పర్యవేక్షణలో సాగుతుంది.
అయినా హద్దులను నిర్ధారించాల్సిన చెరువుల రికార్డులు మాయం కావడం, ఆ వెంటనే ఎందుకు ప్రత్యక్షం అవుతుందోనని అంతు చిక్కని ప్రశ్నగా మారింది. హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ నిర్ధారణ గందరగోళంగా మారుతుంది. నిర్ణీత గడువులోగా హైకోర్టుకు నగరంలో మిగిలి పోయిన చెరువులు, కుంటల భౌతిక స్వరూపం, శాస్త్రీయ పరమైన జియో కో ఆర్డినేషన్ పాయింట్లతో కూడిన జాబితాను నివేదించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం హడావుడిగా పెండింగ్‌లో ఉండే చెరువుల నోటిఫికేషన్ ఖరారు చేసేందుకు తప్పులకు తావిస్తోంది. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లో పొందుపరుస్తున్న వివరాలన్నీ మార్పిడి జరిగినట్లుగా పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు.
మ్యాపుల బఫర్, ఫుల్ ట్యాంక్ లెవల్, జియో కో ఆర్డినేషన్ విషయంలో మ్యాపులను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటికప్పుడు హెచ్ఎండీఏ లేక్ జాబితాలో నుంచి చెరువులను తొలగించడం, ఎవరైనా ప్రశ్నిస్తే మళ్లీ ఆన్లైన్లో కనిపించడం వంటి ఘటనలతో తెర వెనుక జరుగుతున్న టెక్నికల్ మాయాజాలంతో చెరువులు ప్రమాదంలో ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కొత్తగా మరోసారి మ్యాపులను అప్లోడ్ చేయడంతో మరిన్ని సమస్యలు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మ్యాపుల జియో కోఆర్డినేషన్ పాయింట్లు మారిపోవడం వలన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల స్థలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీంతో గతంలో కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలు కూడా ఇప్పుడు సక్రమం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు మాయమైతున్నయ్..?
రాజేంద్రనగర్ పరిధిలోని ముల్గుంద చెరువు(2921) లేక్ ఐడీ వివరాలు హెచ్ఎండీఏ జాబితాలో కనుమరుగై పోయాయి. దీనిపై స్థానికులు, పౌర, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు గుర్తించి విషయం వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ చెరువును 2014లో హెచ్ఎండీఏ గుర్తించింది. కానీ ఎఫ్టీఎల్, క్యాడస్ట్రల్ మ్యాప్ హెచ్ఎండీఏ జాబితాలో లేదని సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ ఆరోపించారు. బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రీస్టీజ్ సిటీ ముల్గుంద లేక్ (పెద్ద చెరువు) ఆక్రమించి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును చేపడుతుంది. ప్రేమవతి పేటలోని ప్రెస్టీజ్ సిటీని ఆక్రమించి, యథేచ్ఛగా చెరువు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చెరువులు అన్యాక్రాంతం అవుతున్నా.. పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. చివరకు హెచ్ఎండీఏ లేక్ వెబ్సైట్ నుంచి ముల్గుంద చెరువు వివరాలను దాచిపెట్టింది.

ఆగని గోప్యత…
ఇటీవల మియాపూర్‌లోని గురునాథ్ చెరువు లేక్ ఐడీ-3711 హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ నిర్వహించే వెబ్సైట్లో లేకుండా పోయింది. రెండు, మూడ్రోజుల పాటు లేక్ వివరాలు కనిపించకపోవడంతో.. ఏం జరిగిందంటూ పలువురు పర్యావరణ వేత్తలు హెచ్ఎండీఏను ఆశ్రయించారు. నేరుగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులకే విషయాన్ని తీసుకెళ్లారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. కనీసం ఎందుకు తొలగించారనే విషయం చెప్పకుండా..సాంకేతిక సమస్యలను బూచీగా పెట్టారు. సాంకేతిక నిర్వహణలో భాగంగా చెరువుల వివరాలు కనిపించకుండా పోతున్నాయి. అలా తమ దృష్టికి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తున్నామంటూ కప్పిపుచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువు భూమిని ఆక్రమించి బడా నిర్మాణం సాగుతుందంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. ఈ ఏడాది జూన్‌లో కాంగ్రెస్ సభ్యుల ప్రకటన చేసిన వెంటనే నానక్‌రాంగూడ గ్రామ పరిధిలోని లేక్ ఐడీ 3712 క్యాడస్ట్రియల్ మ్యాపులు హెచ్ఎండీఏ వెబ్సైట్లో లేకుండా పోయాయి. ఎందుకు ఆ మ్యాపులు కనిపించకుండా పోయాయనే విషయం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో అప్పటికప్పుడు జాబితాలో లేకుండా పోయినా మ్యాపులను రీస్టోర్ చేయాల్సి వచ్చింది.
ఇలా నగరంలో విచ్చలవిడి చర్యలతో కీలకమైన చెరువుల రికార్డులు కనుమరుగైపోతున్నాయి. గతేడాది కిందట కూడా రామాంతాపూర్‌లోని చెరువుల మ్యాపులలో మార్పులు జరిగినట్లుగా గుర్తించారు. అదే విషయంలో హబ్సిగూడలోని మరో కుంట వివరాలు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ అధికారులు దృష్టికి తీసుకెళ్తే… హద్దుల నిర్ధారణ జరగడంతో మార్పులు జరుగుతాయని, అందుకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో మ్యాపులను తొలగిస్తారని హెచ్ఎండీఏ లేక్ విభాగం వెల్లడించి చేతులు దులుపుకున్నది.
తెర వెనుక కాంగ్రెస్ సర్కార్
టెక్నికల సమస్యల మాటున వెలుగులోకి వస్తున్న అంశాలతో తెరవెనుక పెద్ద గూడుపుఠాణీ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం కొన్ని వివాదస్పదమైన చెరువులు మాత్రమే జాబితా నుంచి తొలగించడం, విషయం బయటకు రాగానే మళ్లీ పునరుద్ధరించడం వెనుక కాంగ్రెస్ సర్కారు ఏ మాయజాలం చేస్తుందనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులు కూడా ఏం పట్టనట్లుగా ఇచ్చే వివరణ కూడా ఏదో జరుగుతుందనే అనుమానాలకు తావిస్తోంది.
కేవలం టెక్నికల్ సమస్యలు కొన్ని చెరువులకే ఎందుకు వస్తున్నాయనేది అసలు ప్రశ్న. ఒకవేళ ఆ సమస్యలతో మ్యాపులలో మార్పులు జరిగితే… జలవనరుల భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లేందుకు సహకరిస్తాయనే నిపుణులు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం టెక్నికల్ గ్లిచ్ పేరిట మార్పులు, చేర్పులు సర్వసాధారణ అన్నట్లుగా చెప్పి, తప్పిదాలను కప్పిపుచ్చుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే హెచ్ఎండీఏ పరిధి ఇప్పటివరకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన చెరువుల వివరాలు కూడా మాయమయ్యే ప్రమాదం ఉందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.