సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 3 (నమస్తే తెలంగాణ):‘అత్యధిక ప్రయాణికులకు అందుబాటులో మెట్రో రైలు’… రెండు రోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ప్రధానమైన అంశమిది. దీని ప్రాతిపదికనే నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది… కానీ వాస్తవానికి స్వయానా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) రూపొందించిన పలు అలైన్మెంట్లలో అత్యంత కీలకమైనది… బీహెచ్ఈఎల్- మెహిదీపట్నం- లక్డీకాపూల్ మార్గం. అత్యధికంగా ప్రయాణికులు ఉండటంతో పాటు నిత్యం లక్షలాది మంది వాహనదారులు ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నది కూడా ఈ మార్గంలోనే. వీటన్నింటికీ మించి హెచ్ఎంఆర్ఎల్ గతంలోనే ఈ అలైన్‌మెంట్‌పై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందిస్తే కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ అలైన్‌మెంట్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని సామాజిక మాద్యమాల్లో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘అత్యధిక ప్రయాణికులకు అందుబాటులో మెట్రో రైలు’.. రెండు రోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ప్రధానమైన అంశమిది. దీని ప్రాతిపదికనే నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ వాస్తవానికి స్వయానా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) రూపొందించిన పలు అలైన్మెంట్లలో అత్యంత కీలకమైనది బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ మార్గం. అత్యధికంగా ప్రయాణికులు ఉండటంతో పాటు నిత్యం లక్షలాది మంది వాహనదారులు ప్రస్తుతం ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నది కూడా ఈ మార్గంలోనే. వీటన్నింటికీ మించి హెచ్ఎంఆర్ఎల్ గతంలోనే ఈ అలైన్‌మెంట్‌పై అధ్యయనం పూర్తి చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా రూపొందిస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ అలైన్‌మెంట్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని సామాజిక మాద్యమాల్లో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దూరదృష్టితో కేసీఆర్ ప్రభుత్వం ఆమోదం
హైదరాబాద్ మహా నగరం నానాటికీ విస్తరించడంతో పాటు వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. దీంతో నివాసాలు శివారు ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పటికీ ఉద్యోగ, ఉపాధి, విద్య, వ్యాపార అవకాశాల కోసం లక్షలాది మంది నిత్యం ప్రధాన నగరం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా, సంస్కరణలు తీసుకువచ్చినా ట్రాఫిక్ జంఝాటం మాత్రం తగ్గడం లేదు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం దూరదృష్టితో మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అందులో భాగంగా భవిష్యత్తు అవసరాలకు కొన్ని ఉంటే.. ఇప్పటికిప్పుడు ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రూపొందించినవి కూడా ఉన్నాయి. వీటిలోనే మొదటి వరుసలో బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ మార్గం ఉంది. ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-హైటెక్ సిటీ మార్గాల్లో మెట్రో ఉండగా.. ఇక్కడ ట్రాఫిక్ గణనీయంగా ఉంటుంది. ఇదే క్రమంలో లక్డీకాపూల్ తర్వాత మెహిదీపట్నం వైపు గచ్చిబౌలి.. దాని మీదుగా బీహెచ్ఈఎల్ వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో మెట్రో అందుబాటులోకి వస్తే నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఎంతో ఉపశమనం కలిగేది.
కేంద్రం దగ్గర సిద్ధంగా డీపీఆర్..
రెండు రోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో పలు ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ మార్గంపై గతంలోనే హెచ్ఎంఆర్ఎల్ అధ్యయనం చేయడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా పూర్తి చేసింది. అందులో ఈ మార్గంతో పాటు ఐదు కిలోమీటర్ల ఎల్బీనగర్-నాగోల్ అనుసంధాన అలైన్మెంట్ కూడా చేర్చి పంపారు. రెండింటి అంచనా విలువ రూ.8453 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ 26 కిలోమీటర్ల మెట్రో మార్గానికి సుమారుగా రూ.7,089 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే దీనికి సంబంధించిన డీపీఆర్ కేంద్రం వద్ద ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు చేస్తే నిధులు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ప్రజా ప్రయోజన కోణంలో చూస్తే కూడా ఈ మార్గం ఎంతో కీలకమైనది. ఒకవైపు వాహనదారులకు ట్రాఫిక్ గండం నుంచి గట్టెక్కించడంతో పాటు ప్రధాన నగరంలోని లక్డీకాపూల్ నుంచి నేరుగా గచ్చిబౌలి దగ్గర అవుటర్ రింగు రోడ్డుకు అనుసంధానం ఏర్పడుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టిసారిస్తే బాగుంటుందనే డిమాండ్ వినిపిస్తుంది. బుధవారం సామాజిక మాద్యమాల్లో కూడా దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. నెటిజన్లు అత్యధిక మంది సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షలో ఈ మార్గాన్ని చేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీహెచ్ఈఎల్-మెహిదీపట్నం -లక్డీకాపూల్ మెట్రో మార్గాన్ని మరోసారి పరిశీలించాలి
నగరంలోనే అత్యధిక సంఖ్యలో రాకపోకలు ఉండే మార్గాల్లో ఒకటి బీహెచ్ఈఎల్-మెహిదీపట్నం-లక్డీకాపూల్. ఈ విషయాన్ని గుర్తించిన గత ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేపట్టి, సమగ్ర పాజెక్టు నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై గత మూడేండ్లుగా తీవ్ర స్థాయిలో కసరత్తు జరిగింది. ఇంత జరిగిన తర్వాత కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ మెట్రో మార్గాన్ని పరిశీలనలోకి తీసుకోకుండా కొత్త మార్గాల్లో మెట్రోను నిర్మిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటిగా లక్డీకాపూల్, మెహిదీపట్నం, గచ్చిబౌలి ప్రాంతాలు ఉన్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మెట్రో ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని చెబుతూనే, బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ మెట్రో మారాన్ని ఏక పక్షంగా రద్దు చేసినట్లుగా కనిపిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం లక్డీకాపూల్, మెహిదీపట్నం మీదుగా గచ్చిబౌలి వరకైనా ఒక మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు మరోసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.
– ఇనగంటి రవికుమార్, సామాజికవేత్త, ఆర్టీఐ కార్యకర్త
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నా..?
ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. అందుకు ప్రత్యేక నిదర్శనం నవంబర్ 17న ‘అభయ హస్తం’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అందులో హైదరాబాద్ విజన్ 2030 పేరుతో ఒక అంశాన్ని చేర్చి నగరానికి సంబంధించి చేపట్టే పథకాలను, కార్యక్రమాలను ప్రస్తావించింది. మ్యానిఫెస్టోలోని 39వ ఫేజీలో మెట్రో మార్గానికి సంబంధించి ‘ ఎల్బీనగర్ నుంచి బీహెచ్ఈఎల్ (వయా ఆరాంఘర్-మెహిదీపట్నం-గచ్చిబౌలి) రూట్లలో కొత్త మెట్రో లైన్లను విస్తరింప చేస్తాం’ అని పేర్కొన్నారు. ఎంతో స్పష్టంగా పేర్కొన్న ఈ రూట్‌ను తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో చేపడతామని ప్రకటించిన మెట్రో రూట్లలో ఎక్కడా కనిపించలేదు. కేవలం నాగోల్ నుంచి ఆరాంఘర్ వరకు తీసుకువచ్చి వదిలేస్తున్నది. అక్కడి నుంచి అత్తాపూర్ మీదుగా మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి వరకు ఉన్న మార్గాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉండడంతో నిత్యం నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి.. చేసేది మరొకటి అన్నట్లుగా మారింది.