బంజారాహిల్స్, నవంబర్ 15: ‘మీ నాన్నకు నేను డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ..’ మహిళకు ఫోన్ చేసి ఆమె అకౌంట్లోనుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.1లో నివాసం ఉంటున్న స్వాగత్ రాయ్ అనే గృహిణికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మీ తండ్రికి నేను చాలా కాలంగా రూ.22వేలు ఇవ్వాల్సి ఉందని, మీ నంబర్‌కు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడు. క్షణాల్లోనే ఆమె ఫోన్‌కు రూ.10వేలు, రూ.20వేలు వచ్చినట్లు మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు వచ్చిన వెంటనే స్వాగత్ రాయ్‌కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి తాను పంపిన డబ్బులు వచ్చాయా అని అడిగాడు.
ఫోన్లో మెసేజ్‌లు వచ్చిన విషయాన్ని గురించి ఆమె చెప్పింది. వెంటనే మరో రూ.12వేలు, రూ.20వేలు వచ్చినట్లు మెసేజ్‌లు వచ్చాయి. మరోసారి కాల్ చేసిన అగంతకుడు తాను ఇవ్వాల్సిన డబ్బులకన్నా ఎక్కువ ఇచ్చానని, వాటిని వెనక్కి పంపాలని కోరాడు. తన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రాలేదని, కేవలం మెసేజ్‌లు మాత్రమే వచ్చాయని స్వాగత్రాయ్ చెబుతున్నా వినిపించుకోకపోగా.. తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేయడం ప్రారంభించాడు. మర్యాదగా తాను పంపిన డబ్బులు వెనక్కి పంపించకపోతే కేసు పెడతానంటూ దబాయించడంతో ఆందోళనకు గురైన బాధితురాలు అతడికి రూ.38వేలు పంపించింది. డబ్బులు పంపిన తర్వాత భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పగా సైబర్ నేరస్తులు కావచ్చని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. దీంతో అరగంట వ్యవధిలోనే బంజారాహిల్స్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా.. సైబర్ సెల్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయించి డబ్బులను హోల్డ్ చేయించారు. ఈ మేరకు పోలీసులు సైబర్ నేరగాళ్లపై బీఎన్ఎస్ 318(2), 318(4), 66సీ, 66డీ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.