పేదలకు మెరుగైన వైద్యం అందించేలా.. ప్రభుత్వ దవాఖానల్లో సర్కారు అత్యాధునిక పరికరాలు, యంత్రాలను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర చికిత్స అవసరమైన ఎందరికో పునర్జన్మనిచ్చిన ఉస్మానియా.. అరుదైన, ఉచిత శస్త్ర చికిత్సలకు చిరునామాగా మారింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ముఖ్యంగా పేద హృద్రోగులకు కొండంత అండగా నిలుస్తోంది. వైద్యశాలలో రూ.7 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్‌తో పేదలకు భారం తప్పుతున్నది. గడిచిన మూ డు నెలల్లో 12,740 మందికి ఓపీ సేవలందించగా, 8,777 మందికి వివిధ రకాల గుండె పరీక్షలు జరిపి.. అవసరమైన చికిత్సలు అందించారు.
సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): హృద్రోగులకు వరంగా మారింది ఉస్మానియా జనరల్ వైద్యశాలలోని క్యాథల్యాబ్. గతంలో ఈ ల్యాబ్ లేకపోవడంతో ఉస్మానియాకు వచ్చే రోగులు కొన్ని రకాల గుండె పరీక్షలు, ప్రొసీజర్స్ కోసం బయట ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సాధారణంగా గుండె సంబంధిత పరీక్షలు గాని, చికిత్సగాని ఖరీదైనవి కావడంతో నిరుపేద హృద్రోగులకు ఆర్థిక భారం తప్పేది కాదు. దీనిని గమనించిన తెలంగాణ సర్కార్ ఏడాదిన్నర క్రితం రూ.7 కోట్లతో ఉస్మానియా దవాఖానలో కొత్తగా క్యాథలాబ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ క్యాథలాబ్ ద్వారా నిరుపేదల హృద్రోగులకు ఖరీదైన వైద్య సేవలను పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా అందిస్తున్నారు ఉస్మానియా వైద్యులు. సాధారణంగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడే హృద్రోగులకు క్యాథల్యాబ్ ద్వారా పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వాటి నివేదికల ఆధారంగానే చికిత్స చేయాల్సి ఉంటుంది. గతంలో క్యాథల్యాబ్ లేకపోవడంతో ఉస్మానియాకు వచ్చే హృద్రోగులు సంబంధిత వైద్యపరీక్షల కోసం ప్రైవేటు బాట పట్టాల్సి వచ్చేది. ఉస్మానియాలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాథలాబ్తో పేదలకు ఆర్థిక భారం తప్పడమే కాకుండా సకాలంలో చికిత్స అందుతుండడంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నామంటున్నారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్. గడిచిన మూడు నెలల్లో 12,740మందికి ఓపీ సేవలు అందించగా వారిలో 8777 మందికి పలు రకాల గుండె పరీక్షలు జరిపి, అవసరమైన చికిత్స అందించినట్లు తెలిపారు.
కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్న ఉస్మానియా క్యాథల్యాబ్కు నిరుపేదలు క్యూ కడుతున్నారు. ఖరీదైన వైద్యపరీక్షలతో పాటు మెరుగైన చికిత్స పూర్తి ఉచితంగా లభిస్తుండడంతో తెలుగు రాష్ర్టాల నుండే కాకుండా పొరుగు రాష్ర్టాలైన కర్నాటక, మహారాష్ట్రతో పాటు బిహార్, యూపీ రాష్ర్టాలకు చెందిన రోగులు సైతం ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు సూపరింటెండెంట్ డా.నాగేందర్ తెలిపారు. గడిచిన మూడు నెలల్లో 362 ఆంజియోగ్రామ్స్, 184 పీటీసీఏలు, 8231 2డీ-ఈకో చేశామని, మొత్తం 8777మందికి ఈ క్యాథలాబ్ ద్వారా గుండెకు సంబంధించిన పలురకాల ప్రొసీజర్స్, పరీక్షలు జరిపి చికిత్స అందించినట్లు తెలిపారు. v
ఉస్మానియా హాస్పిటల్‌పై రోగులకు నమ్మకం పెరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తరువాత ప్రభుత్వ వైద్యం పూర్తిస్థాయిలో బలోపేతమైంది. ఒకప్పుడు పనిచేసేందుకు అనుభవజ్ఞులైన వైద్యులున్నప్పటికీ అవసరమైన పరికరాలు ఉండేవి కాదు. ఇప్పుడు అత్యాధునిక వైద్యపరికరాలతో పాటు అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది ఉండడంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించగలుగుతున్నాం. ముఖ్యంగా క్యాథలాబ్ ద్వారా ప్రతి రోజు వందల మందికి సేవలందిస్తున్నాం. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావు చొరవతో ఉస్మానియాకు క్యాథలాబ్ వచ్చిందనే చెప్పాలి. దీంతో మంది నిరుపేద హృద్రోగుల ప్రాణాలు కాపాడగలుగుతున్నాం.
– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా హాస్పిటల్