జవహర్‌నగర్, ఏప్రిల్ 22: అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారు. ఇందులో భాగంగా గొల్లకురుమల కోసం రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. జవహర్‌నగర్ కార్పొరేషన్లో మొదటి విడుతలో 62మందికి గొర్రెల యూనిట్లు వచ్చాయి. తాజాగా రెండో విడుతలో 88మందికి యూనిట్లు మంజూరవడంతో త్వరలోనే పశుసంవర్ధకశాఖ గొర్రెలను అంజేయనుంది.తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి గొర్రెల యూనిట్లు అందజేస్తామని చెప్పి అందరికీ ఇవ్వనుండటంతో గొల్లకురుమలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గొర్రెల యూనిట్ ధర రూ. 1.75లక్షలు కాగా… ప్రభుత్వం రూ. 1.31,250 సబ్సిడీ అందిస్తుండగా లబ్ధిదారుడి వాటా కింద ప్రభుత్వానికి రూ. 43,750 చెల్లించాలి. లబ్ధిదారుడికి 20గొర్రెలు, ఒక పోతును పంపిణీ చేస్తారు. ఇందులో రూ. 1.58లక్షలు గొర్రెల కొనుగోలుకు పోగా, రూ. 6500 రవాణాకు, రూ. 3500 దాణాకు, రూ. 500 మందులకు, రూ. 5వేలు గొర్రెల ఇన్సూరెన్స్‌కు, మరో రూ. 15వేలు అదనపు ఖర్చులకు తీస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాంసం దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొనేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ చేపట్టడంతో దేశంలోని ఇతర రాష్ర్టాలకు మాంసం ఎగుమతి చేసే స్థాయికి ప్రభుత్వం చేరింది. గొల్లకురుమలు వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గొర్రెలను అందజేయడంతో యాదవులు ఆర్థిక పరిపుష్టి చెంది ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు.
గొల్లకురుమల వృత్తికి సీఎం కేసీఆర్ జీవం పోసిం డు. ఆ సారు సల్లంగా ఉండా లే.చిన్నప్పటి నుంచి కుల వృత్తిని నమ్ముకుని గొర్ల కాపరిగానే బతుకుతున్నా. తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పథకాన్ని పెట్టడంతో నాకు మొద టి విడుతలో గొర్రెల యూనిట్ వచ్చింది. 20గొర్లు, 1పొట్టేలు రావడంతో సంతోషం కలిగింది. ఇప్పుడు గొర్రెల నాలుగింతలు కావడంతో శ్రీమంతుని అయ్యాను.
– కొమురయ్య, బీరప్పగడ్డ, జవహర్‌నగర్
గొర్రెల మేకల పోషణకు ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. జవహర్‌నగర్ కార్పొరేషన్‌కు 150 మందికి గొర్రెల యూ నిట్లు మంజూరయ్యాయి. 62 మందికి మొదటి విడుతలో వచ్చాయి. తాజాగా రెండో విడుత గొర్రెల యూనిట్లు 88మందికి రావడంతో యాదవుల్లో ఉత్సాహం నింపుతుంది.
– జవహర్‌నగర్ గొల్లకురుమల సహకారం సంఘం అధ్యక్షుడు మండల సురేందర్ కురుమ