సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఏరియా, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని మున్సిపాలిటీల ఏరియాను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)గా గుర్తించి ఈ మేరకు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)గా ప్రకటించింది. ఇందులో భాగంగానే 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలోకి విలీన ప్రతిపాదనకు మంత్రి వర్గంతో పాటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేశారు. ముసాయిదా దస్త్రంపై రెండు రోజుల క్రితం గవర్నర్ సంతకం చేశారు. ఇదే క్రమంలో రాబోయే మూడు రోజుల్లో మరో మూడు గెజిట్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం పరిధిలో ఉన్న ఈ 27 స్థానిక సంస్థలను ఆ పరిధిలో నుంచి తొలగిస్తున్నట్లు, ప్రకటించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు.
జోన్లకు మరిన్ని అధికారాలంటూ చర్చ
జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న 150 వార్డులను 261 వార్డులుగా పునర్విభజించే ప్రక్రియలో తలమునకలైన అధికారులు, జీహెచ్ఎంసీలో విలీనం కానున్న 27 స్థానిక సంస్థలను మరో 40 నుంచి 45 వార్డులుగా పునర్విభజించి, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం 306 మున్సిపల్ వార్డులు చేసే కసరత్తు దాదాపు తుది దశలో ఉన్నట్లు అధికారుల్లో చర్చ జరుగుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న ఆరు జోన్లను ఎనిమిది గానీ, పదిగా ఏర్పాటు చేస్తారన్న ప్రచారం ఉంది. జీహెచ్ఎంసీ పరిధి గణనీయంగా పెరుగుతుండటంతో ఎకువ కార్యకలాపాలు జోనల్ స్థాయిలో జరిగేలా అధికార వికేంద్రీకరణ జరగనున్నట్లు, ఇందులో భాగంగా జోన్లకు మరిన్ని అధికారాలు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయంటున్నారు.ప్రస్తుతం అయిదు అంతస్తుల వరకు నిర్మాణ అనుమతులను మంజూరు చేసే పవర్ ఉన్న జోన్లకు మున్ముందు పది అంతస్తుల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ అనుమతులు జారీ చేసేలా పవర్ పెంచనున్నట్లు సమాచారం.
నేడో, రేపో ఆర్డినెన్స్
జీహెచ్ఎంసీని విస్తరించాలనే నేపథ్యంలో ప్రభుత్వం మూడు ఆర్డినెన్స్‌లు తీసుకురావాలని నిర్ణయించింది. వీటిలో రెండు జీహెచ్ఎంసీకి సంబంధించినవి, ఒకటి మున్సిపల్ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)కు చట్టబద్ధత కల్పించనున్నారు. ఆర్డినెన్స్‌లను బుధ, గురువారాల్లో గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని అధికార వర్గాల సమాచారం.
జీహెచ్ఎంసీ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పరిధిలో నుంచి తొలగించిన స్థానిక పట్టణ సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నట్లు కూడా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ రెండు ఆర్డినెన్స్‌లు దాదాపు నేడు కానీ గురువారం సాయంత్రం వరకు వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఐతే ప్రభుత్వం విలీనం..వికేంద్రీకరణపై మేదోమథనం జరుపుతున్న క్రమంలోనే వ్యతిరేకతలు మొదలయ్యాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజు నుంచే జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్లో ఎలాంటి చర్చ లేకుండా టేబుల్ ఐటంగా తీసుకువచ్చి ఆమోదించడాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుపట్టారు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సైతం విస్తరణను వ్యతిరేకించారు. పార్టీలతో పాటు తాజాగా మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆల్ పార్టీ జేఏసీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టడం గమనార్హం.
తుక్కుగూడను గ్రేటర్లో విలీనం చేయొద్దు : ఆల్ పార్టీ జేఏసీ

బడంగ్పేట్: తుక్కుగూడ మున్సిపాలిటీని గ్రేటర్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. మంగళవారం తుక్కుగూడలో జేఏసీ సమావేశం నిర్వహించారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి సరిహద్దులో ఉన్న బడంగ్పేట్ కార్పొరేషన్‌ను, ఆదిబట్ల మున్సిపాలిటీని ఎల్బీనగర్ జోన్ పరిధిలో కలుపుతున్నారన్నారని అన్నారు. కాగా తుక్కుగూడను ఎందుకు చార్మినార్ జోన్లో కలపాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఓఆర్ఆర్ ఏర్పడిన తర్వాతే తుక్కుగూడ అభివృద్ధి అయిందన్నారు. గతంలో ఓల్డ్ సిటీ బార్కస్, ఎర్ర కుంట నుంచి రోడ్డు ఉండటంతో వందల సంవత్సరాల నుంచి తుక్కుగూడ పరిసరాలు అభివృద్ధి కి నోచుకోలేదన్నారు. తుక్కుగూడను జీహెచ్‌ఎంలో కలిపే ప్రతి పాదనను ప్రభుత్వం విరమించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తుక్కుగూడను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోక పోతే జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.