ఆదివారం 05 జూలై 2020
Hyderabad - Jul 01, 2020 , 00:24:16

పెండింగ్‌ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..

పెండింగ్‌ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..

మంత్రి తలసానితో బోర్డు సభ్యుల కీలక భేటీ 

ఉదయం 11గంటలకు బోర్డు కార్యాలయంలో సమావేశం

 కంటోన్మెంట్‌: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాయితీల అంశంపై కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి సభ్యులు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో అంతర్భాగంగా కంటోన్మెంట్‌ బోర్డు ప్రాంతం ఉంది. ఈ క్రమంలో అభివృద్ధి పనులతో పాటు, పాలనా వ్యవహారాలన్నీ సెంట్రల్‌ డిఫెన్స్‌ పరిధిలోనే కొనసాగుతుంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మెట్రో వాటర్‌వర్క్స్‌ నుంచి కంటోన్మెంట్‌ ప్రాంతానికి తాగునీరు సరఫరా అవుతున్నది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డు యంత్రాంగం చార్జీలను చెల్లిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత గతంలో కంటే మిన్నగా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ వస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి మిగతా నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలు మాదిరిగానే కంటోన్మెంట్‌లోనూ విస్తరిస్తూ వస్తున్నారు. దీనికి అనుగుణంగానే గతేడాది తాగునీటి చార్జీలు మాఫీ చేయడంతో పాటు రామన్నకుంట చెరువు ప్రక్షాళనకు సంబంధించి నిధులు విడుదల చేశారు. ఈ తరుణంలోనే నేడు(బుధవారం) రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనకు వచ్చేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో బోర్డు కార్యాలయంలో సభ్యులు సమావేశం కానున్నారు. పలు విభాగాల అధికారులు, బోర్డు అధికారులు సంయుక్తంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా నీటి సరఫరా, మురుగునీటి పారుదల, వైద్య ఆరోగ్యంతో పాటు పన్నులు, స్టాంపులు తదితర అంశాలపై చర్చించనున్నారు. 

చర్చించే అంశాలు..

 కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఎంతో కాలంగా నెలకొన్న అనేక సమస్యల పరిష్కారానికిగాను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బుధవారం నేడు ఉదయం 11 గంటల ప్రాంతంలో  కంటోన్మెంట్‌ బోర్డు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే సాయన్నతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు.  ప్రధానంగా బొల్లారం ప్రభుత్వ దవాఖాన నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, నీటి బిల్లుల తగ్గింపు, ప్రస్తుతం సరఫరా చేస్తున్న 50 లక్షల గ్యాలన్ల నుంచి 75 లక్షల గ్యాలన్లకు నీటి సరఫరా పెంపు, పికెట్‌, ప్యాట్నీ నాలాల్లో పూడిక తొలగింపు, నాలా అభివృద్ధి పనులు చేపట్టడం, తదితర సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.  ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, వాటర్‌ వర్క్స్‌ ఎండీ దానకిశోర్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులతో  కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి సభ్యులు, బోర్డు సీఈఓ, అడిషనల్‌ సీఈఓ, వివిధ శాఖలకు చెందిన బోర్డు అధికారులు పాల్గొననున్నారు. 


logo