సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ నడిబొడ్డున అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లోని విశాలమైన పార్కును ఎట్టకేలకు పరిరక్షణ చర్యలకు జీహెచ్ఎంసీ ఉపక్రమించింది. ఏకంగా రోడ్డును బ్లూ షీట్లతో కప్పేసి దాదాపు 500 గజాల పార్కు స్థలాన్ని ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా భూ మార్పిడి ముసుగులో భారీ ఎత్తున టెండర్ పెట్టేసిన బడా కంపెనీ ఒకవైపు , మరోవైపు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, మొద్దు నిద్రను ఆసరాగా చేసుకొని ప్రైవేటు వ్యక్తులు ఏకంగా రెండెకరాల విస్తీర్ణంలోని పార్కు భూములను ఫాంహౌస్‌గా మార్చుకున్నారు.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ రోడ్ నం. 32, రోడ్ నం. 33 మధ్యన అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో మూడెకరాలకు పైగా విస్తీర్ణంలోని పార్కుల్లో భూ బకాసురుల కుట్రలను బట్టబయలు చేస్త్తూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. ఇందులో భాగంగానే శుక్రవారం రోడ్డుకు అడ్డంగా వేసిన బ్లూ షీట్లను తొలగించారు. ఒకటి, రెండు రోజుల్లో సెక్యూరిటీ గార్డుల నిర్మాణ గదులను తొలగించడంతో పాటు టౌన్ ప్లానింగ్, యూబీడీ, డిప్యూటీ కమిషనర్ల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను కమిషనర్‌కు సమర్పించేందుకు సిద్ధమయ్యారు.
అయితే వివాదాస్పదమైన భూ మార్పిడి అంశంలో సదరు కార్పొరేట్ కంపెనీ పట్ల జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా, పార్కు వ్యవహారంలో జరుగుతున్న అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నతాధికారులను ఆదేశించడం, మరోవైపు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, యూబీడీ, డీసీల బృందం పార్కును సందర్శించి ఈ నెల 12న కమిషనర్‌కు నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది.