రెండేండ్ల పాలనతోనే కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రకటించిన ప్రాజెక్టులకు, చేపట్టిన పనులకు, ఇచ్చిన హామీలకు పొంతన లేకపోవడంతో జనాలు విసిగిపోతున్నారు. అడ్డగోలు హామీలతో మభ్యపెడుతున్న తీరుపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే నగరంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి… అంతే హడావుడిగా ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయారు. దీంతో శంకుస్థాపన చేసి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ తట్టెడు మట్టిని తొలగించలేదు. దీంతో నగరాభివృద్ధికి కాంగ్రెస్ చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిలదీసేలా, మెట్రో అనుమతుల విషయంలో దోబూచులాడుతున్న కేంద్ర, రాష్ట్ర సర్కారులను ప్రశ్నిస్తూ సొంతంగా మెట్రో స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. వరుస ఆందోళనలు, ధర్నాలతోపాటు పాదయాత్రలు, కొత్త ఏడాది ఒకటో తారీఖున శంకుస్థాపన చేసి, తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై రోడ్డెక్కనున్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : నగరంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు రక్షణ శాఖ నుంచి భూములు తీసుకువచ్చింది తామేనని, గడిచిన 9 ఏళ్లలో మెట్రో విస్తరణ జరగలేదని కాంగ్రెస్ రెండేండ్లుగా ప్రచారం చేస్తోంది. కానీ నార్త్ సిటీలో 44 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించాలనే ప్రతిపాదనలను మాత్రం పట్టాలెక్కించలేదు. హడావుడిగా డీపీఆర్‌తో సరిపెట్టిన సర్కారు.. ప్రతిపాదనలను కేంద్రానికి పంపి చోద్యం చూస్తున్నది. దీంతో గడిచిన ఏడాదిన్నర కాలంగా నార్త్ సిటీ మెట్రో, ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుల కోసం జనాలు ఎదురుచూస్తునే ఉన్నారు. అయినా అటు కేంద్రంలోని బీజేపీ గానీ, ఇటు రాష్ట్ర సర్కారు గానీ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకు వచ్చి చిత్తశుద్ధిని చాటుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ సర్కారుల చేతిలో ఆటబొమ్మల మారిన ఎలివేటెడ్ కారిడార్, నార్త్ సిటీ మెట్రో ప్రాజెక్టులపై జనాలు ఏండ్లుగా పోరాడుతూనే ఉన్నారు.
త్రిశంకు స్వర్గంలా..
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ బోర్డు డీపీఆర్‌ను ఆమోదించి, కేంద్రానికి పంపించిన తర్వాత నగరంలో మెట్రో విస్తరణ త్రిశంకు స్వర్గంలా మారింది. జేబీఎస్‌ను మెట్రో హబ్‌గా తీర్చిదిద్దుతూ.. పలు అంశాలను డీపీఆర్‌లో పొందుపరిచామని, రూ. 19579 కోట్ల అంచనా వ్యయంతో 86.1కి.మీ పొడువు గల జేబీఎస్- మేడ్చల్, జేబీఎస్- శామీర్‌పేట, ఎయిర్‌పోర్టు ఫ్యూచర్ సిటీ మెట్రో ఫేస్-2 పార్ట్ బీ కారిడార్ల ప్రతిపాదనలతో డీపీఆర్ పూర్తి చేశామని వెల్లడించారు. కానీ ఇప్పటికీ ఏ ఒక్క కారిడార్‌ను కేంద్రం ఆమోదించలేదు. లేని నగరానికి మెట్రో పరుగులు పెట్టించాలని చూస్తుందని కేంద్రం పెద్దలు వారిస్తున్నా నగరంలో మెట్రో విస్తరణ హామీలతో రాష్ట్ర సర్కారు ఊరిస్తోంది.
ప్రాజెక్టులకు జనాల శంకుస్థాపన
కాంగ్రెస్ చెప్పిన కళ్లబొళ్లి హామీలపై నమ్మకం లేక జనాలే ప్రాజెక్టులకు సొంతంగా శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న సుచిత్ర నుంచి జీడిమెట్ల వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. అదే విధంగా 21న జీడిమెట్ల గాంధీ విగ్రహం నుంచి జేబీఎస్ వరకు మరో దఫా పాదయాత్ర, ఆందోళన తర్వాత జనవరి 1న మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. నార్త్ సిటీలో నివాసముండే 30 లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును శంకుస్థాపనలతో ఎండగట్టనున్నారు. డీపీఆర్ రూపొందించి ఏడాదిన్నర గడిచిన ప్రాజెక్టులకు భూ సేకరణ కూడా చేయలేకపోయింది. కనీసం ఎలివేటెడ్ కారిడార్ బాధితులకు పరిహారంపై స్పష్టతనివ్వడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్న జాప్యాన్ని నిలదీసేలా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.