సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): నగరంలోను మొట్టమొదటగా నిర్మించదలిచిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు బాలారిష్టాలు వీడటం లేదు. ఓవైపు రక్షణ శాఖ భూములిచ్చిందని అధికారులు చెబుతున్నా… ప్రైవేటు ఆస్తుల సేకరణ అత్యంత క్లిష్టంగా మారింది. ఇప్పటికే 1000కిపైగా కేసులతో బాధితులంతా కోర్టులను ఆశ్రయించారు. మరోవైపు వంద ఫీట్లకు తగ్గిస్తున్నట్లుగా ప్రకటన చేస్తే గానీ ప్రాజెక్టుకు అవసమైన భూములిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెబుతుండటంతో.. ఎలివేటెడ్ కారిడార్ భవితవ్యం అగమ్యగోచరంగా మారుతోంది. దీంతో కేవలం రక్షణ శాఖ ఇచ్చే భూములతో ప్రాజెక్టు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోతుంది.
అధికారుల ప్రణాళికరాహిత్యమో, లేక కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయమో కానీ ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొని ప్రాజెక్టులు చేపట్టడమే లక్ష్యంగా వ్యవహరించడంతో సామాన్యులు ప్రాజెక్టు డిజైన్లను వ్యతిరేకిస్తున్నారు. జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు నిర్మించనున్న 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ కోసం ఇరువైపులా 200 మీటర్ల భూములను సేకరించాలని ప్రైవేట్ ఆస్తులతోపాటు, రక్షణ శాఖ భూములకు మార్కింగ్ వేశారు. అయితే 6 లైన్ల రహదారులను 120 ఫీట్లలో నిర్మించడం వలన ప్రాజెక్టు డిజైన్లకు వచ్చిన నష్టమేంటనీ బాధితులు ప్రశ్నిస్తున్నా… 200 ఫీట్ల మేర ఆస్తులను సేకరించాల్సిందేనని ప్రభుత్వం మొండిగా వ్యవహారిస్తోంది.
జేబీఎస్ నుంచి శామీర్పేట్ మార్గంలో హెచ్ఎండీఏ దాదాపు 12 కిలోమీటర్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టింది. ఈ మార్గంలో 1500 ఆస్తులను సేకరించడానికి మార్కింగ్ జరిగింది. రెండు వైపులా 100 ఫీట్ల మేర భూములను సేకరించడంతో ప్రస్తుతం ఆ మార్గంలోని ఆస్తులకు రూపురేఖలే లేకుండా పోతున్నాయి. భూసేకరణ విషయంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న బాధితులు… వంద ఫీట్లకు రోడ్డు వెడల్పు తగ్గించేంత వరకు భూములు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇప్పటికే 1200 మందికిపైగా తమ ఆస్తులను రక్షించాలంటూ కోర్టులను ఆశ్రయించారు. మరోవైపు రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు అంగీకరించినా.. ప్రైవేటు ఆస్తుల సేకరణ జరగని పక్షంలో ప్రాజెక్టు ముందుకు సాగడం కష్టమే అని చెప్పాలి. ఈ క్రమంలో అన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండీఏ కూడా ప్రాజెక్టు కోసం భూసేకరణలోని ఇబ్బందులపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ప్రైవేటు ఆస్తుల విషయంలో భూసేకరణ, ప్రాజెక్టు వెడల్పు తగ్గించడం వంటి అంశాలను పరిష్కరిస్తే గానీ కోర్టు వ్యవహారాల నుంచి ఈ ప్రాజెక్టు బయటపడేలా లేదు. ఈ క్రమంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని బాధితులతో నేరుగా చర్చలు జరిపితే గానీ ప్రాజెక్టుకు పునాది పడే అవకాశమే లేకుండా పోయింది.