సిటీ బ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): నగరంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంటున్నది. నీటి సరఫరా నిర్వహణను అధికారులు ఇష్టారీతిన చేపడుతుండటంతో పలు కాలనీలు, బస్తీలకు నీళ్లందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లోని జలమండలి కార్యాలయాలను ముట్టడిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా తాగునీరు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. నెలనెలా నీటి బిల్లులు క్రమం తప్పకుండా వసూలు చేస్తున్న అధికారులు నీళ్లందించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుక్కెడు తాగునీటి కోసం బిందెలు పట్టుకుని రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని వాపోతున్నారు.
ధనవంతులు నివసించే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే బస్తీలు, కాలనీలకు మాత్రం అర్ధగంట కూడా సరఫరా చేయడం లేదని మండిపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లను ఆశ్రయిస్తే బుకింగ్ చేసుకున్నాక కనీసం మూడు నుంచి నాలుగు రోజులకు ట్యాంకర్ డెలివరీ అవుతుందని వాపోతున్నారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పెద్దల దగ్గర డబ్బులు తీసుకుని పేదలు దాహార్తితో అలమటించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధనవంతులుండే ప్రాంతాలకు ఎక్కువ సమయం సరఫరా చేసి.. పేదలుండే బస్తీలకు మాత్రం నీరివ్వడం లేదని జనాలు రోడ్డెక్కుతున్నారు. పేద ప్రజలు తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్యాంకర్లకు రికార్డుస్థాయిలో డిమాండ్ పెరుగుతున్నది. సోమవారం ఏకంగా 15,300 ట్యాంకర్లు బుక్ చేసుకున్నారు. పెద్ద మొత్తంలో ఆయా ఫిల్లింగ్ స్టేషన్లలో ట్యాంకర్లు పెండింగ్‌లో ఉన్నాయి.
అధికారుల నిర్లక్ష్యంతోనే ..
అధికారులు సరఫరాలో నిర్లక్ష్యం వహించడం వల్లనే ట్యాంకర్ల బుకింగ్‌లు వేలల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, మణికొండ, కొత్తగూడ, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాల్లో ట్యాంకర్ల బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ పేదలు, మధ్య తరగతి ప్రజలు నివసించే బస్తీలు, కాలనీల నుంచే బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. జలమండలి వ్యాప్తంగా మంగళవారం 5కేఎల్ ట్యాంకర్లు 15,300 బుక్ చేసుకోగా 10కేఎల్ ట్యాంకర్లను 248 మంది బుక్ చేసుకున్నారు. ఇందులో షేక్‌పేట ఫిల్లింగ్ స్టేషన్లో గరిష్ఠంగా 500 ట్యాంకర్లు పెండింగ్‌లో ఉన్నాయి. డివిజన్ 15 పరిధి గచ్చిబౌలి ప్రాంతంలోని గోల్డెన్ తులిప్ ఫిల్లింగ్ స్టేషన్లో అత్యధికంగా 243 ట్యాంకర్లు బుక్ అయ్యాయి.
జలమండలి పరిధిలోని అత్యధికంగా ట్యాంకర్లు బుక్ అవుతున్న ఫిల్లింగ్ స్టేషన్లలో టాప్ 40 స్థానాల్లో ఉన్నవాటి పరిధిలో ట్యాంకర్లకు ఇన్సెంటివ్ సైతం ఇస్తున్నారు. నగరానికి నిత్యం సరఫరా అయ్యే నీటి పరిమాణం తగ్గకున్నా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సమయం కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయం నీటి సరఫరా చేస్తుండటంతోనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి నగర ప్రజలకు నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.