వాన లేదు.. ముందస్తు హెచ్చరిక లేదు..కానీ శుక్రవారం రాత్రి.. ఒక్కసారిగా మూసీ ఉగ్రరూపం దాల్చింది.. వరద దూసుకొచ్చింది.. ఒకవైపు ముంచుకొస్తున్న ఉపద్రవం.. మరోవైపు ఏం చేయాలో పాలుపోలేని స్థితి..కట్టుబట్టలతో బతికి ఉంటే చాలనుకొని.. తలోదారి.. తమ వారిని కాపాడుకుంటూనే.. తమను తాము రక్షించుకునే ప్రయత్నం.. మూసీ పరీవాహక ప్రాంతాలైన చాదర్‌ఘాట్..మూసారంబాగ్ వాసుల దీనస్థితి ఇది. ముంచెత్తిన మూసీతో తల్లడిల్లిపోయారు. కొందరు వరద తాకిడి తట్టుకోలేక.. ఇండ్లలోంచి బయటకు రాలేక.. నరకం అనుభవించారు.
ఇంతలా.. వరద విలయ తాండవం చేస్తున్నా.. జనజీవనం అస్తవ్యస్తమైనా..ఒక్క అధికారి.. ఏ శాఖ సిబ్బంది కానీ కనిపించలేదు. తీరిగ్గా.. కాలనీలన్నీ జలదిగ్బంధమయ్యాక.. ఒకరి వెనక ఒకరు ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద వచ్చే సంకేతాలు స్పష్టంగా ఉన్నా.. ముందస్తు హెచ్చరికలు లేకుండా..నీరు ఎలా విడుదల చేస్తారన్నది జవాబు లేని ప్రశ్న. గతంలో ఇంతకంటే భారీ వర్షాలు పడినా.. చూడని జల విలయాన్ని ఇప్పుడు నగరం అనుభవించింది. అయితే మూసీ సుందరీకరణ జపం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కావాలనే ప్రజలను భయపెట్టేందుకే ‘ముందస్తు హెచ్చరికలు’ లేకుండా గేట్లు తెరిచిందన్నదని వరద ప్రభావిత ప్రజలు ఆరోపిస్తున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ)/అంబర్‌పేట/సుల్తాన్‌బజార్/బండ్లగూడ: మూసీ వరదలో చిక్కుకున్న వారి రోదన వర్ణనాతీతం. గూడు, కూడు, గుడ్డ పోయి కట్టుకున్న బట్టలతో బతికుంటే చాలనుకుంటూ బయటపడడానికి ప్రయత్నాలు చేసినవారందరూ అసలు ఇంతకుముందెన్నడూ ఈ పరిస్థితే లేదని, ముందుగా సర్కారోళ్లు తమ వద్దకు వచ్చి చెప్పిపోయేవారని అంటున్నారు. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో చాదర్‌ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాల్లోని మూసానగర్, శంకర్‌నగర్, దుర్గానగర్, వినాయకవీధి, అంబేద్కర్‌నగర్ బస్తీలన్నీ నీటమునిగాయి.
మూసీనది ఒడ్డున ఇండ్లు చాలావరకు ఇంటిపైకప్పు వరకు మునిగాయి. అయితే జంట జలాశయాలకు వరద పోటెత్తిందని, అందుకే నీటిని విడుదల చేశామని అధికారులు చెబుతున్నా.. ముందస్తు హెచ్చరికలు ఎలా విడుదల చేశారనేది ప్రస్తుతం వేయిడాలర్ల ప్రశ్న. ఇందుకు సంబంధించి జలమండలి నుంచి రెవెన్యూ, పోలీస్, బల్దియా, హైడ్రాలకు కూడా కనీస సమాచారం లేదని ఆయా శాఖలు చెబుతున్నాయి. శుక్రవారం ఉదయం ప్యాట్నీ సెంటర్లో పర్యటించిన కలెక్టర్ హరిచందన అక్కడవారితో పాటు నగర ప్రజలకు వర్షం వల్ల ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఉందని, వారిని సంప్రదించాలని రొటీన్‌గా చెప్పారు.
కానీ జంట జలాశయాల నుంచి నీటి విడుదలకు సంబంధించి సమాచారం ఇవ్వలేదు సరికదా.. లోతట్టు కాలనీల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఒక్క అధికారి రాలేదు. గతంలో మూసీ వరద సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు రెవెన్యూ యంత్రాంగం మొత్తం తరలివచ్చేది. డీపీఆర్వో ద్వారా ముందస్తు ప్రకటనలు ఇచ్చేవారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ, ఎమ్మార్వోలు క్షేత్రస్థాయికి వచ్చి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఆర్ఐలు, స్థానిక రెవెన్యూ సిబ్బంది ప్రతీకాలనీలో పెద్దలతో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలకు ముందస్తుగా తరలించేవారు.
కానీ ఈసారి తమకు కూడా ఆ సమాచారం లేదని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. జలమండలి తమ పని తాము చేసుకుపోయామని సర్ది చెప్పుకుంటోంది. హైడ్రాకూడా తమకు ఎలాంటి సమాచారం లేదని, తమకు తెలిసిన వెంటనే వచ్చేశామని తమను తాము సమర్థించుకుంటోంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎవరికి వారే తమదికాదంటూ చేతులెత్తేయడంతో సామాన్య ప్రజలు ఇదేం సర్కార్ అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం ..
రాత్రి సమయంలో చాదర్‌ఘాట్, మూసారంబాగ్లలోని పలుకాలనీలను మూసీ వరద ముంచెత్తిన తర్వాత తీరిగ్గా అధికారయంత్రాంగం తరలివచ్చింది. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయకపోగా వర ్షప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. మూసీ వరద కంటే ముందుగానే వర్షాలు కురుస్తున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరద ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులే చెప్పుకొంటున్నారు.
శాఖల మధ్య సమన్వయలోపంతో పాటు ఎవరికి వారే మూసీతీరే అన్నట్లు వ్యవహరించడం సామాన్యుడికి వరద ముప్పు తెచ్చిపెట్టింది. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు పొంచి ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో హైడ్రా ఒంటెద్దు పోకడలు, అనుభవలేమితో పాటు ఇతర శాఖలతో సమన్వయం లేకపోవడం కూడా వరద ముంపు నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడంలో యంత్రాంగం విఫలం కావడానికి కారణమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
పెద్దాపూర్ పంపు హౌస్‌లోకి భారీ వరద
సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌కు మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా పథకంలోని పెద్దాపూర్ జలమండలి మంచినీటి శుద్ధి కేంద్రం ఫేస్-3 పంప్ హౌస్‌లోకి వరద నీరు చేరింది. దీంతో జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి సందర్శించి పునరుద్ధరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దాపూర్ పరిసరాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ముందు జాగ్రత్తగా పంపింగ్ ప్రక్రియను నిలిపేశామని, పంపుహౌస్ నుంచి నీటిని తోడి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తొగరిపల్లి వాగు పొంగడం వల్ల పంపు హౌస్, సబ్ స్టేషన్లలోకి వరద నీరు వచ్చినట్లు ఆయన వివరించారు.