Hyderabad Metro | సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. రోడ్డు మార్గంలో ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కుల నుంచి దూరంగా ఉంటూ నగర వాసులు మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన 2017 నవంబర్ 29 నుంచి ఇప్పటి వరకు 40 కోట్ల మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో అధికారులు వెల్లడించారు. రోజు వారి ప్రయాణికుల సంఖ్య 4.90లక్షలుగా ఉండగా, అతి త్వరలోనే 5లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మెట్రో కారిడార్లన్నీ ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని ఒక చివర నుంచి మరో చివరకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర నుంచి రెండు గంటల సమయం వరకు పడుతుంది. అదే మెట్రోలో వెళితే కేవలం 55 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
వేసవి కాలంతోపాటు తాజాగా వర్షా కాలం సీజన్లో మెట్రోలో ప్రయాణించేందుకు అత్యంత అనుకూలంగా ఉంటుందని నగరవాసులు భావిస్తుంటారు. ఇలా రోజు రోజుకు మెట్రోలో ప్రయాణికుల సంఖ్యలో పెరుగుతుండటంతో మెట్రో కారిడార్‌లో కొత్తగా రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్నది. మెట్రో స్టేషన్లలో కొత్తగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్లో ఉన్న కేఎఫ్‌సీ సెంటర్‌ను, మియాపూర్ మెట్రో స్టేషన్లోనూ ప్రారంభించారు. అదేవిధంగా పంజాగుట్ట మెట్రో స్టేషన్లో కాంటినెంటల్ కాఫీ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. అమీర్‌పేట, రాయదుర్గం, హైటెక్‌సిటీ, కేపీహెచ్‌బీ ఇలా ఒక్కొక్కటిగా మెట్రో స్టేషన్లలో రిటైల్ వ్యాపారులు తమ స్టోర్లను ఏర్పాటు చేస్తూ ప్రయాణికులకు చేరువవుతున్నారు.
రిటైల్ షాపుల ద్వారా మెట్రోకు ఆదాయం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును రవాణా ఆధారిత అభివృద్ధి అనే నినాదంతో చేపట్టారు. ఇందులో భాగంగానే ప్రతి మెట్రో స్టేషన్లో రకరకాల వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా 10 నుంచి 20 షాపుల వరకు స్థలాన్ని కేటాయించారు. మెట్రోలో ప్రయాణిస్తే టికెట్ ద్వారా వచ్చే ఆదాయంతోపాటు స్టేషన్లలోని స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అదేవిధంగా ప్రకటనల ద్వారా మెట్రో సంస్థకు ఆదాయం వస్తున్నది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 69 కి.మీ మేర మూడు కారిడార్ల పరిధిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటితో కారిడార్-1లో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న 29 కి.మీ మార్గంలో మెట్రో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. అదేవిధంగా నాగోల్ నుంచి హైటెక్ సిటీ-రాయదుర్గం వరకు ఉన్న కారిడార్-3లోనూ గణనీయంగా రద్దీ పెరుగుతున్నది. దీంతో ఈ రెండు కారిడార్ల పరిధిలో ఉన్న మెట్రో స్టేషన్లలో రిటైల్ వ్యాపార సంస్థలు కొత్తగా ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మెట్రో సేవలు అందుబాటులో ఉండటంతో నగరవాసులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ట్రాఫిక్ చిక్కులు, కాలుష్యం లేకుండా వేగంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి.