సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతును ప్రకటించింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తున్న కుట్రలను సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. పలు డిపోల వద్ద కార్మికుల సమ్మెకు సంఘీభావంగా గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా నేతలు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి , దిల్సుఖ్నగర్ డిపో వద్ద ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొని కార్మికుల మద్దతు ప్రకటించి ప్రసంగించారు.
ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. 92 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మహాధర్నాకు తలసాని ముఖ్య అతిథిగా హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్టీసీ వేలాది మంది ఉద్యోగుల శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయపరమైనవని, వాటిని పరిష్కరించి సమ్మెను విరమింప చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని తలసాని మండిపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగులతో నడిపించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యక్తులను డ్రైవర్లుగా పెట్టి ఎలక్ట్రిక్ బస్సులను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. నగరంలో రాణిగంజ్, గౌలిగూడ తదితర 5 ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని, ఎవడబ్బ సొమ్మని ప్రైవేట్ సంస్థలకు ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేస్తారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానించి గవర్నర్‌కు పంపించినట్లు గుర్తు చేశారు. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను అమలు చేయడంతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు టార్గెట్లు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల నిర్వాహకులకు ప్యాసెంజర్లు లేకున్నా కిలోమీటర్‌కు రూ.56ల చొప్పున ఎలా చెల్లిస్తారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల 32 డిమాండ్లలో 29 ఆమోదించామంటూ..ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం మాని ఆమోదించిన 29 డిమాండ్లు ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారని తలసాని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడాలని, ‘మీ వెంటే మేమున్నాం’ అని భరోసా ఈ సందర్భంగా తలసాని కార్మికులకు అభయమిచ్చారు. కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.