ఆత్మకూరు, ఆగస్టు 15 : స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ సొంతూరైన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మారుస్తానని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీకి నాలుగేళ్లయ్యింది. మే 21, 2022న అక్కంపేటలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, మొదటగా రెవెన్యూ గ్రామంగా మార్చి, జయశంకర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తానని, పశువుల దవాఖాన నిర్మిస్తానని, జూనియర్ కళాశాల మంజూరు చేయిస్తానని, రాహుల్‌గాంధీని తీసుకొస్తానని హామీల వర్షం కురిపించారు.
కానీ, ఇప్పటికీ ఆ హామీలు కలగానే మిగిలిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదట నుంచి అక్కంపేట గ్రామాన్ని మోసం చేస్తూనే ఉన్నది. మొదట 1975 (వరంగల్ జిల్లా గెజిట్)లో అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూగా ప్రస్తావించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1976లో అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూగా మారుస్తామని నోటిఫై చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి 2024లో ప్రత్యేకంగా జీవో ఇచ్చి హడావుడి చేశారు. గ్రామానికి కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులను పంపించి హంగామా చేశారు.
ఈ క్రమంలో జీవో ఇచ్చి రెండేళ్లు దాటినా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 30 నెలలు దాటినా నేటి వరకు అక్కంపేట రెవెన్యూ గ్రామంగా రికార్డుల్లోకి ఎక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో, పార్లమెంట్ ఎన్నికల సభలో జయశంకర్ జన్మస్థలం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా చేశామని చెప్పారు. కానీ, నేటి వరకు మారలేదు. కాగా, ఆదివారం సీఎం పరకాల పర్యటనకు సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో రచ్చబండలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సభలో ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.