హిందీలో లవ్, రొమాంటిక్ చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ మోహిత్ సూరి దర్శకత్వంలో 2007లో వచ్చిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా ఆవారాపన్. ఇమ్రాన్ హష్మీ, శ్రియా శరణ్, మృణాళిని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కాలక్రమేణా అదే ఆవారాపన్ క్లాసిక్ కల్ట్ సినిమాగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ఆవారాపన్ 2 సిద్ధమైన తరుణంలో ఆనాటి చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నది సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్. ఆవారాపన్ సినిమా విడుదలైన సమయంలో తామంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ ఫలితం నిరాశ పరిచిందని చెప్పుకొచ్చింది.
ట్రెండ్‌కు తగ్గట్టు లేకపోవడం మూలంగా ఆ చిత్రానికి ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారని అభిప్రాయపడింది. ‘ఈ సినిమాకు కొన్ని అవార్డుల వేడుకల్లో నామినేషన్లు వచ్చాయి. కానీ, నన్ను మాత్రం ఆ వేడుకలకు కనీసం ఆహ్వానించలేదు. ఆ సమయంలో నాకు చాలా బాధగా అనిపించింది’ అని శ్రియా ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, అందరూ వేడుకలా జరుపుకొంటారని భావించిన్నట్లు తెలిపిన ఆమె పరిస్థితి దానికి భిన్నంగా మారడంతో మానసికంగా కుంగిపోయానని చెప్పుకొచ్చింది. ‘సినిమాలో ఇమ్రాన్ హష్మీ నటన, ఆల్బమ్‌లోని పాటలు అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆ పాటల కోసమే చూస్తున్నారేమో అని మొదట్లో అనుకున్నా. కానీ రానురానూ జనాలు ఈ కథలోని ఇంటెన్సిటీకి కనెక్ట్ అయ్యారని అర్థమైంది. అందుకే ఇన్నేళ్లయినా ఈ సినిమాను ఇప్పటికీ ఆదరిస్తున్నారు’ అని శ్రియా శరణ్ పేర్కొన్నది.